ఉద్యోగులకు సర్‌ప్రైజ్.. ఒక్కొక్కరికి రూ.80లక్షల బోనస్
Woman Boss surprises her employees gives RS 80 Lakh bonus to Staff.ఓ లేడి బాస్ ఉద్యోగులకు అదిరిపోయే సర్‌ప్రైజ్
By తోట వంశీ కుమార్ Published on 14 Dec 2022 5:41 AM GMTఆర్థిక మాంద్యం భయాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు పెద్ద, చిన్న కంపెనీలు ఉద్యోగుల తొలగింపు, లేఆఫ్‌ల పేరుతో భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో ఉద్యోగులు ఎప్పుడు తమ ఉద్యోగం ఊడుతుందో తెలియని ఆందోళనల మధ్య పని చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఓ లేడి బాస్ ఉద్యోగులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చింది. క్రిస్మస్ సందర్భంగా ఉద్యోగులకు బోనస్ ప్రకటించింది. అదేదో చిన్న మొత్తం అనుకుంటే మీరు పొరబడినట్లే.. ఒక్కొక్కరికి లక్ష డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.80లక్షలకు పైమాటే.
ఆస్ట్రేలియాలో హాన్‌కాక్ ప్రాస్పెక్టింగ్ అనే మైనింగ్, అగ్రికల్చరల్ కంపెనీకి జార్జినా (గినా) రెన్‌హార్ట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, డైరెక్టర్‌గా ఉన్నారు. తన వ్యాపార దక్షతతో మైనింగ్ మొఘల్‌గా పేరుగాంచింది. ఆస్ట్రేలియాలో అత్యంత సంపన్నుల జాబితాలో ఆమె ఒకరు. ఆమె తండ్రి స్థాపించిన హాన్‌కాక్ ప్రాస్పెక్టింగ్‌కు చెందిన రాయ్‌హిల్ అనే మరో సంస్థలోని ఉద్యోగులతో ఇటీవల ఆమె సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో ఆమె 10 మంది ఉద్యోగుల పేర్లను చదివారు. తొలుత వారు ఉద్యోగం ఊడిందేమోనని భయపడ్డారు. అయితే.. వారికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. ఒక్కొక్కరికి లక్ష అమెరికన్ డాలర్ల చొప్పున క్రిస్మస్ బోనస్ ప్రకటించింది. దీంతో అక్కడ ఉన్న ఉద్యోగులు ఆనందంతో గెంతులేశారు. బోనస్ పొందిన వారిలో ఒకరు మూడు నెలల క్రితమే కంపెనీలో చేరడం గమనార్హం.
గత కొంతకాలంగా కంపెనీ మంచి లాభాల్లో ఉంది. గత 12 నెలల కాలంలో 3.3 బిలియన్ల డాలర్లు లాభాన్ని ఆర్జించింది.