పాక్ మురుగునీటి నమూనాలలో వైల్డ్ పోలియోవైరస్
పాకిస్థాన్‌లోని వాయువ్య ఖైబర్ పఖ్తున్‌ఖ్వా (కేపీ) ప్రావిన్స్‌లోని మురుగునీటి నమూనాల్లో వైల్డ్ పోలియోవైరస్ ఉన్నట్లు గుర్తించినట్లు
By అంజి Published on 4 May 2023 2:45 AM GMTపాక్ మురుగునీటి నమూనాలలో వైల్డ్ పోలియోవైరస్
పాకిస్థాన్‌లోని వాయువ్య ఖైబర్ పఖ్తున్‌ఖ్వా (కేపీ) ప్రావిన్స్‌లోని మురుగునీటి నమూనాల్లో వైల్డ్ పోలియోవైరస్ ఉన్నట్లు గుర్తించినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. ఏప్రిల్ 10న కేపీలోని హంగూ జిల్లా, ప్రావిన్షియల్ రాజధాని పెషావర్ నుండి సేకరించిన పర్యావరణ నమూనాలలో వైల్డ్ పోలియోవైరస్ కనుగొనబడిందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపిందని జిన్హువా వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. కనుగొనబడిన రెండు వైరస్‌లు ఈ ఏడాది జనవరిలో ఆఫ్ఘనిస్తాన్‌లోని తూర్పు నంగర్‌హార్ ప్రావిన్స్‌లో కనుగొనబడిన పోలియోవైరస్‌తో జన్యుపరంగా అనుసంధానించబడి ఉన్నాయని తెలిపింది. పోలియోపై పోరులో పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ కలిసి పనిచేస్తాయని పాక్ ఆరోగ్య మంత్రి అబ్దుల్ ఖాదిర్ పటేల్ ఒక ప్రకటనలో తెలిపారు.
పోలియో వైరస్ చాలా అంటువ్యాధి. ఒకరి నుండి మరొకరికి సంక్రమిస్తుంది. ఇది సోకిన వ్యక్తి గొంతు, పేగులలో వైరస్ నివసిస్తుంది. నోటి ద్వారా వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. వ్యాధి సోకిన వ్యక్తి మలం లేదా సోకిన వ్యక్తి తుమ్ము లేదా దగ్గు తుంపరల ద్వారా వ్యాపిస్తుంది. ఈ వైరస్ పిల్లల్లో పక్షవాతానికి కారణమవుతుంది. వారిని వికలాంగులను చేస్తుంది. కొన్నిసార్లు ఈ వైరస్ ప్రాణాంతకం కూడా అవుతుంది. వైల్డ్ పోలియో వైరస్ కేసులు ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌లలో మాత్రమే నమోదు అవుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. 1992 తర్వాత మొజాంబిక్‌లో మొదటిసారి పోలియో వ్యాధికి సంబంధించిన కేసు నమోదు అయింది.