వూహాన్‌లో పర్యటిస్తున్న WHO బృందం.. కరోనా పుట్టుక ఆధారాలు లభించేనా..?
WHO team visits Wuhan hospital in coronavirus investigation. శాస్త్రవేత్తల బృందం వూహాన్‌లో స్థానిక బైషాజు మార్కెట్లో కరోనా పుట్టుకకు సంబంధించి ఆధారాలను బయటకు తీసే పనిలో ఉంది.
By Medi Samrat Published on 1 Feb 2021 10:45 AM ISTవెటర్నరీ, వైరాలజీ, ఆహార భద్రత, ఎపిడెమియాలజీ రంగాల నిపుణులు ఈ బృందంలో ఉన్నారు. ఇప్పటికే వారు వూహాన్ నగరంలోని రెండు కీలక ఆస్పత్రులను సందర్శించారు. కరోనా సంక్షోభం తొలినాళ్లలో కరోనా బారిన పడ్డవారిని అక్కడి ప్రభుత్వం ఈ ఆస్పత్రుల్లో చికిత్స అందించింది.
కాగా, శాస్త్రవేత్తల పర్యటనకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన చేసింది. వూహాన్ సీమార్కెట్‌తో పాటు పలు ఆస్పత్రులను శాస్త్రవేత్తల బృందం సందర్శిస్తోందని ఓ ట్వీట్‌లో పేర్కొంది. అంతేకాదు.. కోవిడ్ రూపొందించిన ప్రయోగశాల అంటూ అంతర్జాతీయ మీడియా ఆరోపించిన వూహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, వూహాన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌ను సందర్శించనున్నారు.
ఆరోపణల నుంచి తప్పించుకునేందుకు చైనా విశ్వప్రయత్నాలు
కాగా, కరోనా వైరస్ విషయంలో చైనాపై మొదటి నుంచి ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణల నుంచి తప్పించుకునేందుకు చైనా విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఒకే ఒక్కసారి వూహాన్‌ను సందర్శించడం ద్వారా శాస్త్రవేత్తలు కరోనా గుట్టును విప్పగలరా..? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కొన్నాళ్లుగా నిరంతరాయంగా పరిశోధనలు జరిపితే తప్ప కరోనా పుట్టుక రహస్యాలను వెలికి తీయలేమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వివిధ జంతువుల నుంచి సేకరించిన జన్యు పదార్థం నమూనాలు, వ్యాధి వ్యాప్తికి సంబంధించి పూర్తిగా అధ్యయనాలు చేయాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అడవి జంతువులను వేటాడే వారి నుంచి వ్యాపారులకు...
అయితే వూహాన్‌లో డబ్ల్యూహెచ్‌వో పర్యటన సందర్భంగా పరిశోధకులు అన్ని రకాలుగా పరిశోధనలు కొనసాగిస్తున్నారు. అడవి జంతువులను వేటాడేవారి నుంచి వ్యాపారులకు, తద్వారా వూహాన్ నగరానికి వైరస్ చేరుకుని ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే కరోనా పుట్టుకకు సంబంధించి చైనా కూడా ఇప్పటికే ఎన్నో వివరణలను ఇచ్చే ప్రయత్నం చేసింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఆహార పదార్థాల ద్వారానే చైనాలోకి వైరస్ ప్రవేశించిందనే వాదనలను ప్రపంచాన్ని నమ్మించలేకపోతోంది. ఈ వాదనలను అంతర్జాతీయ శాస్త్రవేత్తలు తోలిపుచ్చారు. మరి కరోనా మూలాలను కనుగొనేందుకు పర్యటిస్తున్న డబ్ల్యూహెచ్‌వో బృందం చైనాపై ఎలాంటి ప్రకటన చేస్తుందో చూడాలి.