డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక.. ఆ రెండు దగ్గు సిరప్‌లు వాడొద్దు..!
WHO links 2 India-made cough syrups to 19 kids' death in Uzbekistan.నోయిడాకు చెందిన మారియన్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన
By తోట వంశీ కుమార్ Published on 12 Jan 2023 10:50 AM ISTనోయిడాకు చెందిన మారియన్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన రెండు దగ్గు సిరప్‌లను పిల్లలకు ఇవ్వకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సూచించింది. ఉజ్బెకిస్తాన్‌లో 19 మంది చిన్నారుల మరణాలకు కారణమైన తర్వాత భారతదేశానికి చెందిన మారియన్ బయోటెక్ తయారు చేసిన దగ్గు సిరప్‌లను పిల్లలకు ఉపయోగించకూడదని డబ్ల్యూహెచ్‌ఓ ఓ ప్రకటనలో తెలిపింది.
రెండు ఉత్పత్తులు AMBRONOL సిరప్, DOK-1 మాక్స్ సిరప్ లను ల్యాబుల్లో పరీక్షించగా వాటిల్లో విషపూరితమైన డైథలీన్ గ్లైకోల్ లేదా ఇతిలీన్ గ్లైకోల్ ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పింది. దీంతో చిన్నారులకు ఈ సిరప్‌లను ఇవ్వొద్దని ఉజ్బెకిస్థాన్ ప్రజలకు డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.
గత డిసెంబరులో ఉజ్బెకిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారుచేసిన మందులను వాడడం వల్ల దేశంలో 18 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్న సంగతి తెలిసిందే. 21 మంది చిన్నారులు ఈ సిరప్‌లను తాగారని వారిలో 19 మందికి శ్వాసకోశ ఇబ్బందులు వచ్చాయని తెలిపింది. దీనిపై ఉజ్బెకిస్థాన్ డబ్ల్యూహెచ్ఓకి ఫిర్యాదు చేసింది.
"ఈ రెండు ఉత్పత్తులకు ఈ ప్రాంతంలో, ఇతర దేశాలలో మార్కెటింగ్ అధికారాలు ఉండవచ్చు. అవి అనధికారిక మార్కెట్ల ద్వారా ఇతర దేశాలు లేదా ప్రాంతాలకు కూడా పంపిణీ చేయబడి ఉండవచ్చు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని" డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. "ఇలాంటి నాసిరకం ఉత్పత్తులు సురక్షితం కాదు. వాటి ఉపయోగం వల్ల ముఖ్యంగా పిల్లలలో తీవ్రమైన గాయం లేదా మరణానికి దారితీయవచ్చు." అని చెప్పింది.
ఇదిలా ఉంటే.. ఉజ్బెకిస్థాన్‌లో 18 మంది చిన్నారుల మరణానికి కారణమైన మారియన్ బయోటెక్ కంపెనీ ఉత్పత్తి లైసెన్స్‌ను ఉత్తరప్రదేశ్ ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.