ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తాజాగా రెండు కరోనా టీకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో ఒకటి భారత్‌లోని సీరం ఇనిస్టిట్యూట్‌లో ఉత్పత్తి అవుతున్న ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా టీకా కాగా, రెండోది దక్షిణ కొరియాకు చెందిన ఆస్ట్రాజెనెకా-ఎస్‌కే బయో కంపెనీ తయారు చేసినది. ఈ రెండింటి వినియోగానికి డబ్ల్యూహెచ్ఓ అనుమతి ఇచ్చింది. కోవ్యాక్స్ పేరిట ప్రపంచ ఆరోగ్య సంస్థ పేద దేశాలకు కరోనా వ్యాక్సిన్‌ను అందించే కార్యక్రమం చేపట్టింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ మాట్లాడుతూ.. ఈ రెండు టీకాలకు అనుమతి ఇవ్వడంతో కోవ్యాక్స్ ప్రోగ్రాం తరపున ప్రపంచ దేశాలకు టీకా అందించేందుకు మార్గం సుగమం అయిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 190 దేశాలు కోవ్యాక్స్ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి.
ఇక భారత్ వివిధ దేశాలకు కరోనా వ్యాక్సిన్ ను ఉచితంగా అందిస్తోంది. పలు పేద దేశాలకూ అందిస్తూ భారత్ పెద్దన్న మనసు చాటుతోంది. ఇప్పటిదాకా 20 దేశాలకు కోటీ 62 లక్షలకుపైగా కరోనా టీకా డోసులను అందించింది. అందులో 62.7 లక్షల డోసులను ఉచితంగా అందించి ఉదారతను చాటింది. మొత్తం వ్యాక్సిన్లలో 37 శాతం వరకు ఉచితంగా పంపించి.. 'వ్యాక్సిన్ మైత్రి'కి తెరదీసింది భారత్.
యూఏఈ, కువైట్, దక్షిణాఫ్రికా, అల్జీరియా, ఈజిప్ట్, మొరాకో, బ్రెజల్, బంగ్లాదేశ్ వంటి దేశాలకు కొన్ని డోసులను విక్రయించింది. జనవరి 25 నుంచి ఈ నెల 2 వరకు ఆయా దేశాలకు కోటీకి పైగా వ్యాక్సిన్ డోసులను భారత్ అమ్మింది. అన్నింట్లోకి బంగ్లాదేశ్ ఎక్కువగా 50 లక్షల డోసులను కొనుగోలు చేసింది. ఆ దేశానికే అత్యధికంగా 20 లక్షల ఫ్రీ డోసులు వెళ్లాయి.