భార‌త్‌లో క‌రోనా ప‌రిస్థితుల‌పై డ‌బ్ల్యూహెచ్‌వో ఆందోళ‌న‌

WHO Chief says india's covid situation hugely concerning.భార‌త్‌లో క‌రోనా సెకండ్ వేవ్ ఉద్దృతి కొనసాగుతోంది. దీంతో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 May 2021 5:52 AM GMT
భార‌త్‌లో క‌రోనా ప‌రిస్థితుల‌పై డ‌బ్ల్యూహెచ్‌వో ఆందోళ‌న‌

భార‌త్‌లో క‌రోనా సెకండ్ వేవ్ ఉద్దృతి కొనసాగుతోంది. దీంతో గ‌త కొద్ది రోజులుగా ల‌క్ష‌ల్లో పాజిటివ్ కేసులు న‌మోదు అవుతుండ‌గా.. వేల‌ల్లో ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోతున్నారు. దాదాపు ఆస్ప‌త్రుల‌న్ని క‌రోనా రోగుల‌తో నిండిపోతున్నాయి. భార‌త్‌లో క‌రోనా ప‌రిస్థితుల‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ‌(డ‌బ్ల్యూహెచ్ఓ) ఆందోళ‌న వ్యక్తం చేసింది. కొన్ని రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండ‌డంతో పాటు మ‌ర‌ణాలు కూడా ఎక్కువ‌గా ఉంటున్నాయ‌ని డ‌బ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అథ‌న‌మ్ గెబ్రియేసిస్ తెలిపారు.

ప్ర‌పంచ దేశాల‌కు టెడ్రోస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. మ‌హ‌మ్మారి సోకిన తొలి ఏడాది క‌న్నా.. రెండ‌వ ఏడాది మ‌రింత ప్ర‌మాద‌క‌రంగా ఉంటుంద‌ని, మ‌ర‌ణాలు ఎక్కువ సంఖ్య‌లో న‌మోదు అయ్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. ఇక భార‌త్ కు కావాల్సిన సాయాన్ని డ‌బ్య్లూహెచ్ఓ చేస్తోంద‌న్నారు. ఇప్ప‌టికే వేలాది ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్లు, మొబైల్ ఆస్ప‌త్రులు, మాస్కులు స‌హా ఇత‌ర వైద్య సామాగ్రిని స‌ర‌ఫ‌రా చేశామన్నారు. భార‌త్‌కు సాయం చేసేందుకు ముందుకు వ‌స్తున్న వారికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

జెనీవాలో మీడియాతో మాట్లాడుతూ ఆయ‌న ఈ విష‌యాల‌ను వెల్ల‌డించారు. నేపాల్‌, శ్రీలంక‌, వియ‌త్నాం, కాంబోడియా, థాయ్‌లాండ్, ఈజిప్టు దేశాల్లోనూ కొత్త కేసులు, ఆస్ప‌త్రుల్లో చేరుతున్న వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంద‌ని.. అలాగే ఉత్త‌ర‌, ద‌క్షిణ అమెరికా ఖండాల్లోని కొన్ని దేశాల్లోనూ కేసులు, మ‌ర‌ణాలు ఇంకా ఆందోళ‌న క‌రంగానే ఉన్నాయ‌ని తెలిపారు. అన్ని దేశాల‌కు కావాల్సిన సాయాన్ని డ‌బ్ల్యూహెచ్ఓ ఎప్ప‌టికప్పుడు అంద‌జేస్తుంద‌ని చెప్పారు.


Next Story