'మాకు ఎవరి సహాయం అక్కర్లేదు'.. మిత్రదేశాల వైఖరిపై ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు
పశ్చిమ ఆసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు...
By - అంజి |
'మాకు ఎవరి సహాయం అక్కర్లేదు'.. మిత్రదేశాల వైఖరిపై ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు
పశ్చిమ ఆసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) దిగ్బంధనం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తున్నాయి. హోర్ముజ్ జలసంధిని పునఃప్రారంభించేందుకు అమెరికాకు సహకరించాలని మిత్రదేశాలకు పిలుపునిచ్చిన మరుసటి రోజే అధ్యక్షుడు ట్రంప్ తన స్వరాన్ని మార్చారు. అమెరికా మిత్రదేశాల నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. "మాకు ఎవరి సహాయం అవసరం లేదు. మేం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం. మా దగ్గర అత్యంత బలమైన సైన్యం ఉంది" అని ట్రంప్ స్పష్టం చేశారు. నాటో (NATO) సభ్య దేశాలు అవసరమైనప్పుడు అమెరికాకు అండగా నిలబడటం లేదని ఆయన మళ్ళీ విమర్శించారు.
జర్మనీ, స్పెయిన్, ఇటలీ వంటి కీలక దేశాలు హోర్ముజ్ జలసంధికి నౌకాదళాలను పంపే ప్రతిపాదనను తోసిపుచ్చాయి. ముఖ్యంగా జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్స్ మాట్లాడుతూ.. ఈ యుద్ధం ప్రారంభించే ముందు వాషింగ్టన్ లేదా ఇజ్రాయెల్ తమను సంప్రదించలేదని, ఐక్యరాజ్యసమితి లేదా ఈయూ (EU) అనుమతి లేకుండా తాము సైన్యాన్ని పంపలేమని తేల్చి చెప్పారు. అటు బ్రిటన్ (UK) తీరుపై కూడా ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. యుద్ధం క్లిష్ట దశలో ఉన్నప్పుడు విమాన వాహక నౌకలను పంపమని కోరితే బ్రిటన్ నిరాకరించిందని, యుద్ధం ముగిశాక పంపుతామంటే తానే వద్దన్నానని ట్రంప్ వెల్లడించారు.
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించడంతో ఇరు దేశాల మధ్య యుద్ధం ముదిరింది. దీనికి ప్రతికారంగా ఇరాన్ కొత్త అధినేత మొజ్తబా ఖమేనీ ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన హోర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించారు. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 200 డాలర్ల వరకు చేరే ప్రమాదం ఉందని ఇరాన్ హెచ్చరించింది. తన మిత్రదేశాలు కష్టకాలంలో అమెరికాకు ఎంతవరకు మద్దతు ఇస్తాయో పరీక్షించడానికే తాను ఈ పిలుపునిచ్చానని, తన అనుమానాలే నిజమయ్యాయని ట్రంప్ వ్యాఖ్యానించారు.