రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శనివారం తెల్లవారుజామున (జులై 23) తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడంటూ రష్యాన్ టెలిగ్రామ్ ఛానెల్ పేర్కొంది. దీంతో హుటాహుటిన రెండు వైద్య బృందాలు పుతిన్ అధ్యక్ష కార్యాలయానికి వచ్చాయని తెలిపింది. పుతిన్ అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో తన బెడ్‌రూమ్‌లో తీవ్ర వికారంతో బాధపడినట్లు చెప్పింది. 20 నిమిషాల తర్వాత అదనపు వైద్యుల బృందాన్ని పిలిచారు. వెంటనే మెడికల్ ఎమర్జెన్సీ సుమారు మూడు గంటల పాటు మెరుగైన చికిత్స అందించారని, దీని తరువాత క్రెమ్లిన్ నాయకుడి పరిస్థితి మెరుగుపడిందని, ఆ తర్వాత వైద్యులు అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలిపింది.
ప్రస్తుతం పుతిన్ ఆరోగ్యం నిలకడగానే ఉందని అని రష్యా మాజీ ఇంటెలిజెన్స్ అధికారి నిర్వహిస్తున్న టెలిగ్రామ్ ఛానెల్ నివేదిక తెలిపింది. ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణ దాడికి దిగినప్పటి నుంచి పుతిన్ అరోగ్యం ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలన్నింటినీ మాస్కో కొట్టివేసింది. పుతిన్ టెర్మినల్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ఓ పుకారు ఉంది. అతను గత వారం ఇరాన్‌ను సందర్శించినప్పుడు బాడీ డబుల్ ఉపయోగించాడని వదంతులు వ్యాపించాయి. బహిరంగ సమావేశాల్లో ఆయన వణుకుతూ కనిపించాడని రకరకాలు కథనాలు ప్రచురితమయ్యాయి.
అయితే క్రెమ్లిన్ ఈ ఊహాగానాలను కొట్టిపారేసింది. రష్యా నాయకుడు పుతిన్ ఆరోగ్యం అంతా బాగానే ఉందని పేర్కొంది. "ఇటీవల కాలంలో ఉక్రేనియన్ సమాచార నిపుణులు, అమెరికన్, బ్రిటీష్ వారు పుతిన్ ఆరోగ్యం గురించి నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్నారని మాకు తెలుసు. ఇవి నకిలీలు తప్ప మరేమీ కాదు" అని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ అన్నారు. రష్యాలో రెండు దశాబ్దాలకు పైగా అధికారంలో ఉన్న పుతిన్ ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పైకి సైన్యాన్ని పంపి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించారు.
టెలిగ్రామ్ ఛానెల్‌ని మాజీ రష్యన్ ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ లెఫ్టినెంట్ జనరల్ "విక్టర్ మిఖైలోవిచ్" అనే మారు పేరును ఉపయోగించి నడుపుతున్నారు.