మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. గంటకు 42 మంది మృతి..!
US reports more than 1000 Covid deaths in single day.కరోనా మహమ్మారి విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా
By తోట వంశీ కుమార్ Published on 19 Aug 2021 3:22 AM GMT
కరోనా మహమ్మారి విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా అదుపులోకి వచ్చినట్లే కనిపించగా.. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా కేసులు నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇక అమెరికాలో దాదాపు సగానికి పైగా వ్యాక్సిన్ వేయించుకోవడంతో కరోనా అదుపులోకి వచ్చింది. అయితే.. డెల్టా వంటి కొత్త రకాలు వెలుగు చూడడంతో తాజాగా మరోసారి అక్కడ కరోనా తీవ్ర రూపం దాలుస్తోంది. అక్కడ సగటున ప్రతి రోజూ గంటకు 42 మంది వరకు చనిపోతుండగా.. రోజుకు 1000 మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైన తర్వాత అమెరికాలో కరోనా వైరస్ దాదాపు అదుపులోకి వచ్చినట్టే కనిపించింది. కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండడంతో నిబంధనలు కూడా సడలించారు. చాలా ప్రాంతాల్లో మాస్కులను ధరించడంపై ఉన్న ఆంక్షలను సడలించింది. ఇప్పుడు డెల్టా వేరియంట్ వంటి కొత్త రకాల వల్ల తాజాగా మళ్లీ అక్కడ కొత్త కేసులు పెరుగుతున్నాయి. గత నెల రోజులుగా వీటి సంఖ్య మరింతగా పెరిగింది. రోజుకు సగటున 769 మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారు. మంగళవారం ఒక్క రోజే దేశంలో 1017 మంది ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. తాజా మరణాలతో కలుపుకుని అమెరికాలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 6.22 లక్షలకు చేరుకుంది.
క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో.. ఆస్పత్రుల్లో చేరే రోగుల సంఖ్య పెరుగుతోంది. చివరి రెండు వారాల్లో ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య 70శాతం మేర పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. భవిష్యత్తులో మరింత ప్రమాదకర పరిస్థితులు తలెత్తవచ్చునని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) హెచ్చరించింది.