భారత్-అమెరికా దేశాల మధ్య మైత్రి చాలా ఏళ్లుగా కొనసాగుతూ ఉంది. అయితే ఇటీవల అమెరికా నేవీ కాస్త దూకుడుగా ప్రవర్తించింది. భారత ప్రదేశిక జలాల్లో నేవీ ఆపరేషన్ నిర్వహించడం కూడా చర్చనీయాంశమైంది. దీంతో భారత్ కూడా కాస్త సీరియస్ అయ్యింది. లక్షదీవులకు సమీపంలో యూఎస్ఎస్ జాన్ పాల్ జోన్స్ డెస్ట్రాయర్ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఆపరేషన్స్ నిర్వహించగా.. భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సముద్ర చట్టాలు ఇతర దేశాల మిలిటరీ చర్యలను అంగీకరించవని స్పష్టం చేసింది. దీంతో అమెరికా కాస్త వెనక్కు తగ్గింది.
కొద్దిరోజుల భారత్ ముందస్తు అనుమతి లేకుండా భారత ప్రదేశిక జలాల్లో నేవీ ఆపరేషన్ నిర్వహించిన అమెరికా.. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే తాము ఈ పని చేసినట్లు ప్రకటించింది. దీనికి ఇండియా అనుమతి అవసరం లేదే అని చెప్పింది. దీనిపై భారత విదేశాంగ శాఖ కాస్త ఘాటుగానే స్పందించింది. దీంతో అమెరికా కాస్త వెనక్కు తగ్గి వివరణ ఇస్తూ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 7న యూఎస్ నేవీ 7వ ఫ్లీట్‌లో భాగమైన యూఎస్ఎస్ జాన్ పాల్ జోన్స్, హిందూ మహా సముద్రంలో రొటీన్ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఆపరేషన్ నిర్వహించింది.
అంతర్జాతీయ చట్టాలకు, ప్రపంచవ్యాప్తంగా సముద్రాల స్వేచ్ఛకు అమెరికా మద్దతు తెలపడంలో భాగంగా ఈ పని చేశామని చెప్పుకొచ్చింది. వివిధ అంశాల్లో మేము భారత భాగస్వామ్యాన్ని గౌరవిస్తామని.. ఇండోపసిఫిక్‌లో ప్రాంతీయ భద్రత కూడా అందులో భాగం అని అమెరికా రక్షణ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. భారత్ తమకు ఎప్పటికీ మిత్ర దేశమేనని.. ఇలాగే ఇరు దేశాల మధ్య బంధం కొనసాగుతుందని అమెరికా అధికారులు తెలిపారు.