America : వలసదారులతో భారత్‌కు బయలుదేరిన అమెరికా విమానం
సరైన పత్రాలు లేకుండా అమెరికాలోకి ప్రవేశించే భారతీయులపై చర్యలు ప్రారంభమయ్యాయి. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. అక్రమ వలసదారులను అమెరికా సైనిక విమానం ద్వారా భారతదేశానికి పంపుతున్నారు.
By Medi Samrat Published on 4 Feb 2025 11:31 AM ISTAmerica : వలసదారులతో భారత్‌కు బయలుదేరిన అమెరికా విమానం
సరైన పత్రాలు లేకుండా అమెరికాలోకి ప్రవేశించే భారతీయులపై చర్యలు ప్రారంభమయ్యాయి. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. అక్రమ వలసదారులను అమెరికా సైనిక విమానం ద్వారా భారతదేశానికి పంపుతున్నారు. అధ్యక్షుడు ట్రంప్ అక్రమ వలసదారులను దేశం నుండి తరిమికొట్టడానికి సైన్యం సహాయం తీసుకున్నారు.
నివేదిక ప్రకారం.. సి-17 విమానం వలసదారులను తీసుకుని భారతదేశానికి బయలుదేరిందని ఓ అధికారి తెలిపారు. సమాచారం ప్రకారం.. 18,000 మందికి పైగా భారతీయులు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నారు. అలాంటి భారతీయుల వీసా గడువు ముగియడం లేదా వారు అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించి ఉండటం జరిగివుంటుందని చెబుతున్నారు.
ఎల్ పాసో, టెక్సాస్, శాన్ డియాగో, కాలిఫోర్నియా నుండి 5,000 మందికి పైగా వలసదారులను బహిష్కరించడానికి విమానాలను ప్రారంభించినట్లు పెంటగాన్ నివేదించింది. ఇప్పటివరకు వలసదారులను గ్వాటెమాలా, పెరూ, హోండురాస్‌లకు సైనిక విమానం ద్వారా పంపారు.
ట్రంప్ గత నెలలో విలేకరులతో మాట్లాడుతూ.. “చరిత్రలో మొదటిసారిగా.. మేము అక్రమ వలసదారులను గుర్తించి, సైనిక విమానంలో వారి దేశాలకు తిరిగి పంపుతున్నామన్నారు. అక్రమ వలసదారుల సమస్యపై అమెరికా పరిపాలన యంత్రాంగానికి సహాయం చేయడం గురించి భారత్ కూడా స్పందించింది. ఈ విషయంలో అమెరికాకు సహాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఇటీవల విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రకటించారు.
కొద్ది రోజుల క్రితం 538 అక్రమ వలసదారులను అరెస్టు చేశారు. వందల మంది సైనిక విమానాలను ఉపయోగించి దేశం నుంచి బహిష్కరించారు.
వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మాట్లాడుతూ.. "ట్రంప్ పరిపాలన 538 మంది అక్రమ వలస నేరస్థులను అరెస్టు చేసింది, ఇందులో అనుమానిత ఉగ్రవాది, నలుగురు ట్రెన్ డి అరగువా ముఠా సభ్యులు, మైనర్లపై లైంగిక నేరాలకు పాల్పడిన అనేక మంది అక్రమ వలసదారులు ఉన్నారు."
డేటా ప్రకారం.. 2024 నాటికి 20,407 మంది భారతీయులు ఎలాంటి పత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తున్నారు. వీరిలో 17,940 మంది తుది తొలగింపు ఉత్తర్వుల్లో ఉన్నారు. మరో 2,467 మంది ICE ఎన్‌ఫోర్స్‌మెంట్ తొలగింపు కార్యకలాపాల కింద అదుపులో ఉన్నారు. అమెరికాలో 14 మిలియన్ల మంది అక్రమంగా నివసిస్తున్నారు.