అమెరికాలో మళ్లీ ప్రభుత్వం షట్‌డౌన్, ఆరేళ్ల తర్వాత ఫెడరల్ నిలిపివేత సంక్షోభం
దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత అమెరికా మరోసారి ఫెడరల్ ప్రభుత్వం షట్‌డౌన్‌కు చేరుకుంది.
By - Knakam Karthik |
అమెరికాలో మళ్లీ ప్రభుత్వం షట్‌డౌన్, ఆరేళ్ల తర్వాత ఫెడరల్ నిలిపివేత సంక్షోభం
వాషింగ్టన్: దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత అమెరికా మరోసారి ఫెడరల్ ప్రభుత్వం షట్‌డౌన్‌కు చేరుకుంది. సెనెట్‌లో తాత్కాలిక నిధుల బిల్లు ఆమోదం పొందకపోవడంతో మంగళవారం అర్ధరాత్రి 12:01 గంటలకు ప్రభుత్వం అధికారికంగా నిలిచిపోయింది. 55-45 ఓట్ల తేడాతో బిల్లు విఫలమైంది. దీంతో రాబోయే రోజుల్లో “నాన్-ఎసెన్షియల్” సర్వీసులు ఆగిపోవడం ఖాయం. దీని ప్రభావంతో ఎయిర్ ట్రావెల్, ఆర్థిక నివేదికలు, చిన్న వ్యాపార రుణాలు, పరిశోధన కేంద్రాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది.
రిపబ్లికన్లు – డెమోక్రాట్ల మధ్య రాజీ అవకాశాలు కనిపించకపోవడంతో ఆఖరి క్షణంలో ఒప్పందం జరగడం దాదాపు అసాధ్యం అయ్యింది. డెమోక్రాట్లు ఆరోగ్య బీమా సబ్సిడీలు కొనసాగించాలి, మెడికెయిడ్ కోతలు వెనక్కి తీసుకోవాలి అని పట్టుబడుతున్నారు. రిపబ్లికన్లు మాత్రం “బడ్జెట్ బందీ చేయడం 2026 ఎన్నికల రాజకీయమే” అని ఆరోపిస్తున్నారు.
ప్రెసిడెంట్ ట్రంప్ మాత్రం పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేశారు. “షట్‌డౌన్ అయితే వేలమందిని లేఆఫ్ చేస్తాం, వాళ్లు డెమోక్రాట్లు అవుతారు” అని హెచ్చరించారు. ఇదిలా ఉంటే, ఇప్పటికే 1.5 లక్షల ఫెడరల్ ఉద్యోగులు బయటకు వెళ్లేలా భారీ బైఔట్ ప్రోగ్రామ్ అమలులో ఉంది. ఈ పరిస్థితుల్లో మిలిటరీ సిబ్బంది, సెక్యూరిటీ ఏజెన్సీలు విధుల్లో ఉంటారు కానీ జీతాలు ఆగిపోతాయి. అయితే, ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ 90% సిబ్బందిని ఫర్లో చేస్తోంది. EPA కాలుష్య నివారణ పనులు నిలిపివేస్తోంది. నేషనల్ పార్కులు, మ్యూజియంలు, జూ డోర్లు మూసేయనున్నారు. 2018లో ట్రంప్ డిమాండ్ చేసిన బోర్డర్‌వాల్ నిధులపై 35 రోజుల పాటు అమెరికా చరిత్రలోనే పొడవైన షట్‌డౌన్ జరిగింది. ఇప్పుడు మళ్లీ అదే సంక్షోభం పునరావృతమవుతోంది.