విమానాశ్రయం లక్ష్యంగా మరిన్ని దాడులు..!
US general warns ISIS attacks likely to continue in Afghanistan.కాబూల్ విమానాశ్రమంలో ఉగ్రదాడి జరిగే
By తోట వంశీ కుమార్ Published on 27 Aug 2021 2:44 PM ISTకాబూల్ విమానాశ్రమంలో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని అమెరికాతో సహా పలు దేశాలు జారీ చేసిన హెచ్చరికలు నిజం అయ్యాయి. అఫ్గానిస్థాన్ తాలిబన్ల హస్తగతం కావడంతో అక్కడ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయపడుతున్నారు. దీంతో అఫ్గాన్ దేశ ప్రజలతో పాటు అక్కడ నివసిస్తున్న విదేశీయులు అఫ్గాన్‌ను విడిచి వెళ్లేందుకు కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్దకు భారీగా చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విమానాశ్రయం దగ్గర ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, బ్రిటన్ దేశాలు గురువారం ఉదయం హెచ్చరికలు జారీ చేయగా.. కొన్ని గంటల వ్యవధిలోనే గురువారం సాయంత్రం విమానాశ్రయం వెలుపల జంట పేలుళ్లు జరిగాయి.
ఈ పేలుళ్లలో ఇప్పటి వరకు 103 మంది చనిపోయారు. అందులో 13 మంది అమెరికా సైనికులు చనిపోగా.. 90 మంది అఫ్గాన్ ప్రజలు మరణించారు. 150 మందికి పైగా గాయపడినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ దాడికి ఐఎస్ఐఎస్-ఖోర్సా బాధ్యత తీసుకుంది. కాగా.. మృతుల్లో 28 మంది తాలిబన్లు కూడా ఉన్నారని తాలిబన్లు ప్రకటించారు.
ఎయిర్ పోర్టు లక్ష్యంగా మరిన్ని దాడులు..
అయితే.. ఇంతటితోనే ఈ దాడులు ఆగిపోవని అమెరికా సెంట్రల్ కమాండ్ జనరల్ ఫ్రాంక్ మెకంన్జీ తెలిపారు. విమానాశ్రయంపై మరిన్ని దాడులు జరిగే అవకాశాలున్నాయని చెప్పారు. ఈ సారి ఎయిర్ పోర్టును లక్ష్యంగా చేసుకుని రాకెట్లు, వాహన బాంబులతో దాడులకు పాల్పడే అవకాశం ఉందని వెల్లడించారు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనడానికి సిద్దంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఎయిర్ పోర్టు బయట ఉన్న వారితో పాటు ఎయిర్ పోర్టు లోపల ఉన్నవారు కూడా జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు.