దొంగలు, నేరస్థుల ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు పలు రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఒక్కోసారి వారి ఆచూకీ ఎంతకీ దొరక్కపోతే మోస్ట్ వాండేట్ అంటూ ప్రకటించి, పట్టించిన వారికి బహుమతి ఇస్తుంటారు. అయితే.. పోలీసులు రూపొందిన మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో తన పేరు లేదని ఓ నేరస్తుడు సోషల్ మీడియా వేదికగా పోలీసుల దృష్టికి తీసుకువచ్చాడు. ఎన్నో రోజులుగా తప్పించుకుంటూ తిరుగుతున్న అతగాడిని వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన అమెరికాలో జరిగింది.
వివరాలు ఇలా ఉన్నాయి. హత్యలు,సాయుధ దోపిడి, కిడ్నాప్ వంటి తీవ్రమైనన నేరాలకు పాల్పడిన వ్యక్తుల జాబితాతో కూడిన టాప్-10 మోస్ట్ వాంటెడ్ నేరస్థుల జాబితాను అమెరికాలోని జార్జియాలో ఇటీవల విడుదల చేశారు రాక్‌డేల్ కౌంటీ షెరీఫ్ ఆఫీస్ అధికారులు. దీన్ని అన్ని సామాజిక మాధ్యమాల్లోనూ పోస్ట్ చేశారు.
క్రిస్టోఫర్ స్పాల్డింగ్ అనే నేరస్థుడు ఈ జాబితాను ఫేస్‌బుక్‌లో చూశాడు. ఇందులో తన పేరు లేదని గుర్తించాడు. 'మరీ నా సంగతి ఏంటీ 'అంటూ ఆ పోస్ట్‌పై కామెంట్ చేశాడు. దీనిపై రాక్‌డేల్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం వెంటనే స్పందించింది. 'మీరు చెప్పింది నిజమే. మీ మీద కూడా రెండు వారెంట్లు ఉన్నాయి. మేము వస్తున్నాం' అంటూ బదులు ఇచ్చారు. ఆ మరుసటి రోజునే అతడిని అరెస్ట్ చేశారు.
అనంతరం.. రాక్‌డేల్ కౌంటీ షెరీఫ్ అధికారులు ఫేస్‌బుక్‌లో మరో పోస్టు పెట్టారు. అందులో.. 'నిన్ను పట్టుకోవడానికి నీ సహాయాన్ని అభినందిస్తున్నాం. 'అని క్రిస్టోఫర్ ఫోటోతో సహా పోస్ట్ చేశారు. మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో నీ పేరు లేకపోతే నిన్ను వెతకడం లేదని అర్థం కాదంటూ అందులో చెప్పుకొచ్చారు. దీనిపై నెటీజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.