అగ్రరాజ్యాన్ని వణికిస్తోన్న మంచు తుఫాన్
US East Coast blanketed by 'bombogenesis' snowstorm.అగ్రరాజ్యం అమెరికాను మంచు తుఫాన్ వణికిస్తోంది. బలమైన గాలులు
By తోట వంశీ కుమార్ Published on 30 Jan 2022 11:12 AM ISTఅగ్రరాజ్యం అమెరికాను మంచు తుఫాన్ వణికిస్తోంది. బలమైన గాలులు, భారీగా మంచు కురుస్తోంది. ఫలితంగా ఎక్కడ చూసినా మంచు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి కనిపిస్తోంది. న్యూయార్, బోస్టన్, ఫిలడెల్ఫియాలో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. రహదారులపై రెండు అడుగుల ఎత్తున మంచు పేరుకుపోయింది. ఫలితంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఇక విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయి వేలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మంచు కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే బెంబేలెత్తిపోతున్నారు.
ప్రజల సంక్షేమం కోసం అమెరికా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. మంచు తుఫాన్ ధాటికి ప్రభుత్వ కార్యాలయాలను, విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. రహదారులపై పేరుకుపోయిన మంచును తొలగిస్తున్నారు. పలురైల్వే మార్గాలను మూసివేశారు. ఇక మంచు తుఫాన్ కారణంగా దేశ వ్యాప్తంగా నాలుగు వేల విమాన సర్వీసులను రద్దు చేసినట్లు విమానయాన సంస్థలు ప్రకటించాయి.
ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో రెండు అడుగుల మేర మంచు పేరుకుపోయింది. ఇప్పటికే పలు హైవేలను మూసివేశారు. భారీగా హిమపాతం పడటంతో నార్తరన్ విస్కోన్సిన్ మిచిగాన్, మిడ్ వెస్ట్, గ్రేట్ లేక్స్ ప్రాంతాల్లో మంచు తుఫాన్ హెచ్చరికలు జారీ చేశారు. దక్షిణ డకోటాలో 25 అడుగుల మంచు పేరుకుపోయినట్లు వెదర్ సర్వీస్ మెట్రో లాజిస్ట్ స్టీవెన్ ప్లెజీల్ తెలిపారు. కాగా.. మంచు తుఫాన్ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో చాలా రాష్ట్రాలు అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి.