అమెరికాలో తొలి ఒమిక్రాన్‌ మరణం.. ధృవీకరించిన అధికారులు

US confirms its first Omicron death.ద‌క్షిణాఫ్రికాలో వెలుగుచూసిన క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ శ‌ర‌వేగంగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Dec 2021 4:25 AM GMT
అమెరికాలో తొలి ఒమిక్రాన్‌ మరణం.. ధృవీకరించిన అధికారులు

ద‌క్షిణాఫ్రికాలో వెలుగుచూసిన క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ శ‌ర‌వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్ప‌టికే చాలా దేశాల్లో చాప‌కింద నీరులా విస్త‌రిస్తోంది. ఇక అగ్ర‌రాజ్యం అమెరికాలో ఒమిక్రాన్ కార‌ణంగా తొలి మ‌ర‌ణం న‌మోదైంది. సోమ‌వారం టెక్సాస్‌లోని హారిస్‌ కౌంటిలో ఓ వ్య‌క్తి మృతి చెందిన‌ట్లు కౌంటి ఆరోగ్య‌శాఖ తెలిపింది. అత‌డి వ‌య‌స్సు 50 నుంచి 60 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉంటుంద‌ని.. ఇప్ప‌టికే అత‌డు రెండు సార్లు క‌రోనా బారిన ప‌డి కోలుకున్న‌ట్లు చెప్పారు. కాగా.. అత‌డు ఒక్క‌డోసు వ్యాక్సిన్ కూడా తీసుకోలేద‌న్నారు.

అమెరికాలో క‌రోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లోని ఆస్ప‌త్రులు క‌రోనా రోగుల‌తో నిండిపోతున్నాయి. గ‌త కొద్ది రోజులుగా నిత్యం ల‌క్ష‌కు పైగా కేసులు న‌మోదు అవుతున్నాయి. నిన్న ఒక్క రోజే లక్షన్నర క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. గ‌త వారం రోజుల్లో 8.5ల‌క్ష‌ల‌కు పైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 8 వేల మందికి పైగా మ‌ర‌ణిచారు. ఇక రెండు వారాల్లో 18 లక్షల కేసులు నమోదు కాగా.. ఇందులో ఒమిక్రాన్ కేసులే అత్యధికం. ఈ నెల 18తో పూర్తయిన వీక్లీ సీక్వెన్సింగ్ డేటా ఆధారంగా అమెరికాలో కరోనా కేసుల్లో 73శాతం ఒమిక్రాన్‌ వేరియంటే కారణమని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్ వెల్ల‌డించింది.

ఇదిలా ఉంటే.. పాజిటివ్ వచ్చిన వారి నుంచి కొత్త వేరియంట్ ఎంతమందికి సోకిందనే టెన్షన్ నెల‌కొంది. రానున్న 3 నుంచి 8 వారాల్లో కోట్ల మందికి ఈ కొత్త వేరింయ‌ట్ సోకే ప్ర‌మాదం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు. పెరుగుతున్న కేసులతో అమెరికా వైద్య వ్యవస్థ కుప్పకూలే అవకాశం ఉందని ఆందోళన వ్య‌క్తం అవుతోంది. ఇప్పటికే ఆస్ప‌త్రిలో చేరిన వారికి వైద్య సేవలు అందించడం కష్టమవుతోంది. క్రిస్మస్ పండుగ దగ్గరపడుతుండ‌డంతో సెలబ్రేషన్స్ ఊపందుకున్నాయి. దీంతో వైరస్ ఇంకా ప్రభలే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో జ‌న‌వ‌రిలో అమెరికాలో క‌రోనా విల‌య‌తాండ‌వం త‌ప్ప‌ద‌ని అంటున్నారు.

Next Story