జాన్సన్ అండ్ జాన్సన్ నుండి సింగిల్ డోస్ వ్యాక్సిన్
US Clears Johnson & Johnson Single-Shot Covid Vaccine For Emergency Use. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తాజాగా సింగిల్ డోస్ వ్యాక్సిన్ ను తీసుకుని వస్తోంది.
By Medi Samrat Published on 28 Feb 2021 12:02 PM GMTకరోనా మహమ్మారిని అంతం చేయడానికి వ్యాక్సిన్లు ఎంతగానో దోహదపడుతూ ఉన్నాయి. ఇక ప్రస్తుతానికైతే పలు ఫార్మా కంపెనీలకు సంబంధించిన వ్యాక్సిన్లు అందుబాటులోకి రాగా.. మరిన్ని కంపెనీలు కూడా వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యాయి. ప్రస్తుతానికి వేస్తున్న వ్యాక్సిన్లు రెండు డోసుల్లో తీసుకోవాల్సి ఉండగా.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తాజాగా సింగిల్ డోస్ వ్యాక్సిన్ ను తీసుకుని వస్తోంది. జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ ను అత్యవసర వినియోగానికి అనుమతి ఇస్తూ, అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశాలు జారీ చేసింది.
ఈ వ్యాక్సిన్ కరోనా కొత్త స్ట్రెయిన్ల మీద కూడా సమర్ధవంతంగా పని చేస్తున్నట్టు తేలింది. ఇదొక ఆనందకరమైన వార్త. కరోనాను పారద్రోలేందుకు మనం చేస్తున్న పోరాటం ఇంకో మెట్టు ఎక్కింది.. అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఓ ప్రకటనలో వ్యాఖ్యానించారు. అమెరికన్లు వైరస్ వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రొటోకాల్ నిబంధనలను ఉల్లంఘించవద్దని, జనసమ్మర్ధం ఉన్న ప్రాంతాలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలని సూచించారు. మాస్క్ ధరించకుండా ఉండవద్దని అన్నారు. కరోనాపై పూర్తిగా విజయం సాధించేంత వరకూ జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాలని అన్నారు.
జాన్సన్ అండ్ జాన్సన్ తయారు చేసిన టీకా యూఎస్ లో 85.9 శాతం, సౌతాఫ్రికాలో 81.7 శాతం, బ్రెజిల్ లో 87.6 శాతం ప్రభావవంతమైనదని రుజువైంది. మార్చి చివరికి 2 కోట్ల డోస్ లను, జూన్ నాటికి 10 కోట్ల డోస్ ల వ్యాక్సిన్ ను ప్రపంచానికి అందిస్తామని జాన్సన్ అండ్ జాన్సన్ పేర్కొంది. అమెరికాలో ఇప్పటివరకూ 6.5 కోట్ల మందికి వ్యాక్సిన్ అందింది. మరో 25 కోట్ల మందికి టీకా అందాల్సి వుంది. అందుబాటులో ఉన్న రెండు వ్యాక్సిన్లూ, కరోనా కొత్త స్ట్రెయిన్ లు వెలుగుచూడక ముందు పరిశీలించినవని, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ కొత్త స్ట్రెయిన్ లు వచ్చిన తరువాత ట్రయల్స్ జరుపుకుందని మైనీ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ విభాగం అధికారి నీరవ్ షా తెలిపారు. కొత్త కరోనా రకాల పైనా ఇది పని చేస్తున్నట్టుగా తేలిందని అన్నారు.
ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ లను రెండు డోస్ లుగా ఇవ్వాల్సి వుండగా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ మాత్రం ఒక్క డోస్ వ్యాక్సిన్ మాత్రమే కావడంతో డిమాండ్ పెద్ద ఎత్తున ఉండే అవకాశం కనిపిస్తోంది. అమెరికాలో కరోనా మహమ్మారి కారణంగా 5 లక్షల మందికి పైగా మృత్యువాత పడ్డారు.