అగ్రరాజ్యం అమెరికా చెప్పినట్లుగానే చేసింది. అఫ్గానిస్థాన్‌లోని ఇస్లామిక్ స్టేట్ స్థావరాలే లక్ష్యంగా డ్రోన్ దాడులు చేసింది. నంగహర్‌లో ఐసిస్ సభ్యునిపై వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో ఒక ఐసిస్ సభ్యుడు ప్రాణాలు కోల్పోయాడని నేవీ కెప్టెన్ విలియం అర్బన్ తెలిపారు. ఇంకా ఎంత మంది చనిపోయారనే విషయం తమకు తెలియని చెప్పారు. కాగా.. ఇస్లామిక్ శిబిరాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేసిన నేపథ్యంలో పౌరులు సాధ్యమైనంత తొందరగా కాబుల్ విమానాశ్రయాన్ని ఖాళీ చేయాలని అమెరికా హెచ్చరించింది.
గురువారం సాయంత్రం కాబుల్ విమానాశ్రయం వెలుపల జంట పేలుళ్లు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పేలుళ్లలో వందమందికి పైగా మరణించగా.. చాలా మంది గాయపడ్డారు. కాగా.. మృతుల్లో 13 మంది అమెరికా సైనికులు కూడా ఉన్నారు. ఈ దాడికి పాల్పడింది తామేనని ఐసిస్ ప్రకటించింది.ఈ ఘటనపై అగ్రరాజ్యం అమెరికా ఆగ్రహాం వ్యక్తం చేసింది. పేలుళ్లకు కారకులైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. తమ సైనికుల ప్రాణాలు తీసిన వారిపై తప్పక ప్రతీకారం తీర్చుకుంటామని తెలిపారు. ఉగ్రమూకలు తగిన మూల్యం చెల్లించాల్సిందేనని హెచ్చరించారు. అలా చెప్పిన కొద్ది గంటల్లోనే ఐసిస్ స్థావరాలే లక్ష్యంగా అమెరికా దాడులకు పాల్పడింది.