ఉత్తరప్రదేశ్ పోలీసులు నమోదు చేసిన ఓ కేసులో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సహా మరో ముగ్గురు గూగుల్ ఇండియా ఉన్నతాధికారుల పేర్లను తాజాగా ఎఫ్ఐఆర్ నుంచి తొలగించారు. ఈ కేసుకు వారికి ఎలాంటి సంబంధం లేదని విచారణలో తేలినట్లు ఉత్తరప్రదేశ్ పోలీసులు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా ఉన్న ఓ వీడియోను వారణాసికి చెందిన ఓ వ్యక్తి వాట్సప్, యూ ట్యూబ్‌లలో చూశాడు. దీనిపై అతడు అభ్యంతరం వ్యక్తం చేయగా అతడికి ఏకంగా 8,500 బెదిరింపు కాల్స్ వచ్చాయి.
వెంటనే అతడు ఫిబ్రవరి 6న బేలుపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు గూగుల్ ప్రతినిధులు సహా 17 మందిపై కేసు నమోదు చేశారు. అనంతరం విచారణ చేపట్టారు. విచారణలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సహా, మరో ముగ్గురు గూగుల్ ఉన్నతాధికారులకు ఈ వీడియోతో ఎటువంటి సంబంధం లేదని గుర్తించారు. వెంటనే వారి పేర్లను ఎఫ్ఐఆర్ నుంచి తొలగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా.. ఈ వీడియోను గాజీపూర్ జిల్లాకు చెందిన సంగీత కళాకారులు రూపొందించినట్టు భావిస్తున్న పోలీసులు వారి పేర్లను మాత్రం ఎఫ్ఐఆర్‌లో అలాగే ఉంచారు. ఇంకా విచారణ కొనసాగుతున్నట్లు చెప్పారు.