ఐక్యరాజ్య సమితి కీలక ప్రకటన.. సీజనల్ వ్యాధిగా కరోనా
UN says covid may become seasonal.కరోనా వైరస్ త్వరలోనే సీజనల్ వ్యాధిగా మారనున్నదని ప్రకటించింది.
By తోట వంశీ కుమార్ Published on 18 March 2021 9:23 AM GMTచైనాలోని వుహన్ నగరంలో తొలుత బయటపడిన కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు ఇప్పుడు మళ్లీ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 11.95కోట్లు దాటింది. మరణాల సంఖ్య 26.50లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2.06కోట్లకు పైగా ఉన్నాయి. వ్యాక్సిన్ వచ్చినప్పటికి కేసుల సంఖ్య పెరగడం ఆందోళనకరమైన విషయం. కొత్త రూపాల్లో కొవిడ్ విజృంభిస్తోంది. కరోనా పీడ ఎప్పుడు విరగడ అవుతుందా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఐక్యరాజ్య సమితి మరో బాంబు పేల్చింది.
కరోనా వైరస్ త్వరలోనే సీజనల్ వ్యాధిగా మారనున్నదని ప్రకటించింది. కరోనా వ్యాప్తిపై వాతావరణ మార్పులు, గాలి నాణ్యత ప్రభావాలపై ఐరాస నిపుణుల బృందం అధ్యయనం చేసింది. దాని ఆధారంగానే ఐరాస ఈ హెచ్చరిక జారీ చేసింది. వాతావరణ అంశాల ఆధారంగా కరోనా నిబంధనలకు సడలింపులు ఇవ్వొద్దని ప్రపంచదేశాలకు సూచించింది. శ్వాసకోశ వైరల్ ఇన్‌ఫెక్షన్లు తరచూ సీజనల్‌గా మారతాయని ఈ నిపుణుల బృందం వెల్లడించింది. శీతాకాలంలో ఇన్‌ఫ్లూయెంజా విజృంభణ ఉంటుందని, సమశీతోష్ణ వాతావరణ పరిస్థితుల్లో జలుబు కరోనా వైరస్ వ్యాప్తి ఉంటుందని వెల్లడించింది. ఈ తీరు కొన్ని సంవత్సరాల పాటు కొనసాగితే, కొవిడ్-19 సీజనల్ వ్యాధిగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని పేర్కొంది.
కొన్ని ప్రాంతాల్లో వేడి వాతావరణంలో కూడా ఈ మహమ్మారి విజృంభించిందని, రాబోయే సంవత్సరంలో ఇలాగే జరగదని చెప్పడానికి ఆధారాలు లేవని తెలిపింది. చల్లని, పొడి వాతావరణంలో, తక్కువ స్థాయిలో అతినీలలోహిత కిరణాల ప్రసారం ఉన్నప్పుడు వైరస్ ఎక్కువ కాలం మనుగడ సాగించినట్లు గుర్తించామంది. వైరస్ ప్రసారంపై వాతావరణ మార్పులు, గాలి నాణ్యత ఏ మేరకు ప్రభావం చూపుతాయన్నదానిపై స్పష్టత రావాల్సి ఉందని చెప్పింది. మరోవైపు వాయు కాలుష్యం మరణాల రేటు పెంపునకు దోహదం చేస్తుందని, వైరస్ ప్రసారంపై మాత్రం నేరుగా ప్రభావం చూపదని కొన్ని అధ్యయనాలు ప్రాథమికంగా వెల్లడిచేస్తున్నాయి.