పైన బాంబుల మోత.. అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్‌లో ప్రసవించిన మహిళ
Ukrainian woman gives birth to baby girl in air raid shelter in Kyiv.ఉక్రెయిన్-రష్యాల మధ్య యుధ్దం తీవ్ర రూపం
By తోట వంశీ కుమార్ Published on 26 Feb 2022 3:27 PM ISTఉక్రెయిన్-రష్యాల మధ్య యుధ్దం తీవ్ర రూపం దాల్చింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై మూడో రోజు కూడా బాంబుల దాడి కొనసాగుతోంది. దీంతో అక్కడ ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని స్థానికంగా ఉండే అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్‌లలో తలదాచుకుంటున్నారు. యుద్ద విమానాలు, బాంబుల మోతతో కీవ్ నగరం చిగురుటాకులా వణుకుతున్న వేళ.. అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్‌లో తలదాచుకుంటున్న ఓ 23 ఏళ్ల నిండు గర్భిణికి పురిటి నొప్పులు ప్రారంభం అయ్యాయి. అక్కడ ఉన్న వారు ఆమెకు సాయం చేయగా.. పండంటి ఆడబిడ్డకు జన్మ జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కొందరు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ప్రస్తుతం కీవ్ నగరంలో అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లనే ప్రాణాలు కాపాడుకోవడానికి బంకర్లుగా వాడుతున్నారు. స్థానిక ప్రజలు టెలిగ్రామ్ యాప్ ద్వారా ఒకరినొకరు కమ్యూనికేట్ చేసుకుంటున్నారు. అండర్ గ్రౌండ్ మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. ఫ్లాట్‌ఫామ్‌లను ఆవాసాలుగా మార్చుకుని బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నారు. రష్యా దాడుల వల్ల ఇప్పటికే లక్ష మంది చెల్లాచెదురయ్యారు. పోలాండ్, మాల్డోవా, రొమేనియా, హంగేరి, స్లోవేకియా దేశాలకు ఉక్రెయిన్ వాసులు వలస వెలుతున్నారు. గురువారం ఒక్క రోజే సుమారు 35వేల మంది పోలాండ్‌లోకి ప్రవేశించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు ఉక్రెయిన్‌లోని ఖార్కీవ్ నగరంలో బాంబుమోతతో పాటు గడ్డకట్టే చలి ప్రజలను వణికిస్తోంది. గురువారం మైనస్ 2 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదు కాగా.. శుక్రవారం మైనస్ 6 డిగ్రీలకు పడిపోయింది. కళ్లముందు పేలుతున్న బాంబులను చూస్తూ ఎముకలు కొరికే చలికి వణుకుతూ ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు.