ఉక్రెయిన్‌తో శాంతి చర్చలపై పుతిన్ కీలక వ్యాఖ్యలు

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ శాంతి చర్చలపై స్పందించారు. ఓ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

By Srikanth Gundamalla  Published on  30 July 2023 9:49 AM GMT
Ukraine, Zelenski, Russia, War, Putin,

 ఉక్రెయిన్‌తో శాంతి చర్చలపై పుతిన్ కీలక వ్యాఖ్యలు

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఏడాది దాటినా కూడా యుద్ధం కొనసాగుతుండటం.. శాంతి చర్చలు జరపాలని రష్యాకు చెబుతున్నా పట్టించుకోలేదు. ఇక ఉక్రెయిన్‌ కూడా చిన్న సైన్యమే అయినా లొంగడం లేదు. పెద్ద దేశాల సాయం తీసుకుని రష్యా దాడులను ఎదుర్కొంటూనే ఉంది. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ శాంతి చర్చలపై స్పందించారు. ఓ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలను తాము తోసిపుచ్చడం లేదని అన్నారు.

రష్యా అధ్యక్షుడు సెయింట్‌ పీరట్స్‌బర్గ్‌లో రష్యా-ఆఫ్రికా సదస్సులో పాల్గొన్నారు. ఆ తర్వాత మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. . ఉక్రెయిన్‌తో రష్యా చేస్తున్న యుద్ధాన్ని విరమించాలని ఆఫ్రికా దేశాలు పుతిన్‌ను కోరిన విషయం తెలిసిందే. దీనిపై విలేఖరులు అడిగిన ప్రశ్నలకు పుతిన్‌ సమాధానాలు ఇచ్చారు. శాంతి చర్చలకు ఇరు ఉక్రెయిన్‌ సహా రష్యా ఏకాభిప్రాయం అవసరం అని అన్నారు పుతిన్. కానీ.. ఉక్రెయిన్‌ చేస్తున్న దాడులు ఈ ప్రక్రియలో ముందడుగు వేసేందుకు సహకరించడం లేదని అన్నారు.

రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు జరగాలని ఆఫ్రియా, చైనా సహా పలు దేశాలు కోరుకుంటున్నాయని పుతిన్ అన్నారు. ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఎప్పుడూ రష్యా వ్యతిరేకించదని చెప్పారు. కానీ.. ఉక్రెయిన్‌ సైన్యం ఇప్పుడు ఆక్రమణలకు దిగుతోందని అన్నారు. దీంతోపాటు భారీ స్థాయిలో వ్యూహాత్మక ఆపరేషన్లు చేపడుతోందని తెలిపారు. ఒక పక్క వారు మాపై దాడులు చేస్తుంటే.. మేమెలా కాల్పుల విరమణ ప్రకటిస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. పుతిన్‌ వ్యాఖ్యలను చూస్తుంటే యుద్ధం ఇప్పుడే ఆగేలా కనిపించడం లేదు. దాడులకు ప్రతిదాడులు అని ఉక్రెయిన్‌ భావిస్తోంది.. రష్యా కూడా అదే రీతిలో వ్యవహరిస్తోంది. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ప్రారంభమై 17 నెలలు దాటింది. ఉక్రెయిన్‌లోని 20 శాతం భూభాగాన్ని రష్యా ఆక్రమించింది.

రష్యా తమ భూభాగాన్ని ఆక్రమించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెబుతున్నారు. తాము ఇప్పుడు అస్సలే కాల్పుల విరమణ ఒప్పందాన్ని చేయలేమని అన్నారు. అలా చేస్తే పుతిన్‌ బలగాలు తిరిగి బలోపేతం కావడానికి తగిన సమయం ఇచ్చినట్లు అవుతుంది అని జెలెన్‌ స్కీ తెలిపారు.

Next Story