పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి యూకే హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన తాజా బెయిల్ పిటిషన్‌ను లండన్‌లోని కింగ్స్ బెంచ్ డివిజన్ హైకోర్టు కొట్టివేసిందని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తెలిపింది. పంజాబ్ బ్యాంకుకు 13 వేల కోట్ల రుణం ఎగవేసిన కేసులో నీరవ్ మోదీ జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. ఇదే కేసులో మోహుల్ చోక్సీ కూడా దోషిగా ఉన్నాడు. లండన్‌లోని కింగ్స్ బీచ్ డివిజన్ కోర్టు బెయిల్‌ను తిరస్కరించింది. క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ అడ్వకేట్‌తో పాటు సీబీఐ ఈ కేసులో నీరవ్ మోదీకి వ్యతిరేకంగా వాదించారు.
నీరవ్ మోదీపై మూడు కేసులు ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు ఫ్రాడ్ కేసులో సీబీఐ రిపోర్టుతో పాటు మనీల్యాండరింగ్ ఆరోపణలపై ఈడీ కేసు, సాక్ష్యులపై వత్తడి తీసుకువస్తున్న దాఖలైన సీబీఐ కేసులు ఉన్నాయి. 2019, మార్చి 19వ తేదీన అప్పగింత వారెంట్ కింద అతన్ని అరెస్టు చేశారు. 2021, ఏప్రిల్‌లో అతన్ని భారత్‌కు అప్పగించాలని ఆ నాటి యూకే హోంమంత్రి ప్రీతి పటేల్ ఆదేశించారు. కానీ లండన్ సుప్రీంకోర్టులో అతను న్యాయ పోరాటం చేస్తున్నారు.