మరో కొత్త వైరస్‌ను గుర్తించిన శాస్త్రవేత్తలు.. బ్రిటన్‌ వాసుల్లో మరింత భయాందోళన

UK finds more coronavirus cases with 'concerning' mutations.తాజాగా మరో కొత్త రకం వైరస్‌ వెలుగు చూసినట్లు యూకేకు చెందిన శాస్త్రవేత్తలు వెల్లడించారు. కరోనా వైరస్‌ రూపం మార్చుకుని కెంట్‌ వేరియంట్‌గా మారి బ్రిటన్‌ చుట్టూ విస్తరించి ఉందని చెబుతున్నారు

By Medi Samrat  Published on  3 Feb 2021 8:04 AM IST
UK finds more coronavirus cases with concerning mutations

ఒక వైపు కరోనా.. మరో వైపు యూకే స్ట్రెయిన్‌ వైరస్‌ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇటీవల బ్రిటన్‌, సౌతాఫ్రికా దేశాల్లో వెలుగు చూసిన కొత్త వేరియంట్‌ వైరస్‌ మరింత ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా మరో కొత్త రకం వైరస్‌ వెలుగు చూసినట్లు యూకేకు చెందిన శాస్త్రవేత్తలు వెల్లడించారు. కరోనా వైరస్‌ రూపం మార్చుకుని కెంట్‌ వేరియంట్‌గా మారి బ్రిటన్‌ చుట్టూ విస్తరించి ఉందని చెబుతున్నారు. అయితే ఇది కొన్ని కొత్త జన్యు మార్పులతో వ్యాప్తి చెందుతున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.

బ్రిటన్‌ మీడియా సంస్థ బీబీసీ న్యూస్‌ ఈ మేరకు కథనాన్ని ప్రసారం చేసింది. బ్రిటన్‌ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించినట్లు తన కథనంలో పేర్కొంది. వేగంగా వ్యాపిస్తూ మరింత భయాందోళనకు గురి చేస్తున్న స్ట్రెయిన్‌ వైరస్‌లో మరో జన్యుమార్పు (మ్యూటేషన్‌) సంభవించడం అనేది సహజంగానే పెద్ద సంచలనం సృష్టిస్తోంది. కాగా, శాస్త్రవేత్తలు ఈ మార్పుకు ఈ484k అని నామకరణం చేసినట్లు బీబీసీ పేర్కొంది. ఈ వైరస్‌కు సంబంధించి అతికొద్ది శాంపిళ్లలో మాత్రమే ఈ మర్పు జరిగినట్లు వారు పేర్కొన్నారు.

కొత్తగా వెలుగు చూసిన ఈ వైరస్‌ వ్యాప్తి పరిమితంగానే ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇక దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌కు చెందిన స్ట్రెయిన్‌లలో కూడా E484కే మార్పును నిపుణులు ఇప్పటికే గుర్తించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాల సామర్థ్యంపై ఈ మ్యుటేషన్‌ కొంత ప్రభావం చూపినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ టీకాలు ఇప్పటికీ ఆశిస్తున్న ఫలితాలు ఇస్తాయని వెల్లడిస్తున్నారు.

అయితే ఈ మార్పు టీకా ప్రభావాన్ని తగ్గిస్తున్నప్పటికీ ప్రస్తుతం వాడుకలో ఉన్నవి ఇంకా పని చేయాలని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు కొత్త వేరియంట్ల వ్యాప్తిని నియంత్రించే చర్యలను బ్రిటన్‌ సర్కార్‌ ఇప్పటికే ముమ్మరం చేసింది. దక్షిణాఫ్రికా వేరియంట్‌కు సంబంధించి అత్యవసర పరీక్ష ఇంగ్లాండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రారంభం అవుతోందని, విదేశాల నుంచి మరిన్ని కేసులు ప్రవేశించకుండా ఉండడానికి ప్రయాణ ఆంక్షలు విధించారు.

పబ్లిక్‌ హెల్త్‌ ఇంగ్లాండ్‌తో కలిసి పని చేస్తున్న నిపుణులు E484K మ్యుటేషన్‌తో యూకే వేరియంట్‌ కొన్ని కేసుల్లో మాత్రమే కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ముఖ్యంగా 2,14,159 నమూనాలను పరీక్షించగా, కేవలం 11 మందిలో మాత్రమే కొత్త రకం వైస్‌ కనిపించిందని బ్రిటన్‌ అధికారులు ప్రకటించారు.


వైరస్‌ నిపుణుడు డా. జూలియన్‌ టాంగ్‌ ఏమంటున్నారంటే..


లీసెస్టర్ విశ్వవిద్యాలయంలోని వైరస్‌ నిపుణుడు డాక్టర్ జూలియన్‌ టాంగ్ మాట్లాడుతూ.. వైరస్‌ మరింత పరివర్తన చెందడానికి అవకాశాలన నివారించడానికి ప్రతి ఒక్కరూ కోవిడ్‌ నిబంధనలను తప్పకుండా పాటించాలన్నారు. వ్యక్తుల మద్య భౌతిక దూరం పెరిగినప్పుడు, ప్రతి ఒక్కరు మాస్కులు ధరించినప్పుడే కరోనా కేసులను తగ్గించగల్గుతామని పేర్కొన్నారు. ఎలాంటి వైరస్‌ వచ్చినా.. అందులో మనం కాపాడుకునేది చాలా ఉంటుందన్నారు.


Next Story