బ్రిటన్ కరోనా వైరస్ ఎన్ని దేశాలకు పాకేసిందంటే..!
UK Coronavirus Strain Detected In At Least 60 Countries. బ్రిటన్ కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా 60 దేశాలను బ్రిటన్ కరోనా చుట్టేసిందట.
By Medi Samrat Published on 20 Jan 2021 7:00 PM IST
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతలా అతలాకుతలం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్తగా బ్రిటన్ లో పుట్టుకొచ్చిన కరోనా స్ట్రెయిన్ విషయంలో కూడా దేశాధినేతలు చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు. కొత్త కరోనా స్ట్రెయిన్ ను అడ్డుకోడానికి చాలానే ప్రయత్నాలు చేశారు కానీ.. అది వీలు పడలేదు. బ్రిటన్ కరోనా ప్రపంచవ్యాప్తంగా 60 దేశాలను బ్రిటన్ కరోనా చుట్టేసిందట..! ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.వో) కొవిడ్ పై బుధవారం విడుదల చేసిన తన నివేదికలో ఈ విషయాన్ని తెలిపింది.
గత వారంలోనే 10 దేశాలకు అది వ్యాపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇక దక్షిణాఫ్రికా రకం కరోనా 23 దేశాలకు పాకిందని చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా వారంలో 47 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయని చెప్పింది. గత వారంతో పోలిస్తే కేసులు 6 శాతం తగ్గాయని పేర్కొంది.మరణాలు మాత్రం పెరిగాయని.. రికార్డ్ స్థాయిలో ఒక్క వారంలోనే 93 వేల మంది కరోనాకు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తోంది డబ్ల్యూ.హెచ్.వో. అంతకుముందు వారంతో పోలిస్తే మరణాల సంఖ్య 9 శాతం అధికమని తెలిపింది. మొత్తంగా ప్రపంచమంతటా 9.3 కోట్ల మంది కరోనా బారిన పడగా.. 20 లక్షల మందికి పైగా మరణించారని తెలిపింది.
వైరస్‌లో వేగంగా కొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు వ్యాక్సిన్ వేయడంలో ఆలస్యం జరిగితే కొత్త రకాల కరోనా వైరస్ లు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం అభివృద్ధి చెందుతోన్న వ్యాక్సిన్లు ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన అన్ని రకాల కరోనా వైరస్‌లకు పని చేసే అవకాశం ఉన్నప్పటికీ వ్యాక్సిన్లతో పాటు ఇప్పటి వరకు ఉన్న చికిత్సలకూ నయం కాని కొత్త రకం వైరస్ కూడా వచ్చే అవకాశం లేకపోలేదని అంటున్నారు. జాప్యం చేయకుండా వ్యాక్సిన్లు వేయాలని, కరోనా కట్టడి జాగ్రత్తలను పాటించాలని చెబుతున్నారు. లేదంటే కరోనా వైరస్‌లో చోటు చేసుకుంటోన్న జన్యు మార్పులు కొత్త సమస్యలకు దారి తీస్తాయని హెచ్చరిస్తున్నారు. ఒక్క మార్పు వల్ల పరిస్థితి మొత్తం మారిపోయే ప్రమాదం ఉందన్నారు. 2014లో ఎబోలా విజృంభణ సమయంలోనూ ఆ వైరస్‌లో వచ్చిన ఒక్క మార్పుతో పరిస్థితి ప్రమాదకరంగా మారిందని అప్పటి పరిస్థితులను గుర్తు చేశారు. కొత్త కరోనా రకాలను గుర్తించేందుకు మరిన్ని చర్యలు చేపట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా శాస్త్రవేత్తలను కోరింది.