ఇరాన్ దాడుల హెచ్చరికల నేపథ్యంలో పౌరుల భద్రతను దృష్టిలో ఉంచుకుని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఈద్ అల్-ఫితర్ సందర్భంగా నిర్వహించే బహిరంగ ప్రార్థనలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. సాధారణంగా ఈద్ పండుగ వేళ ఈద్గాలు లేదా మైదానాల్లో జరిగే భారీ బహిరంగ ప్రార్థనా సమావేశాలకు ఈసారి అనుమతి ఉండదని, ప్రార్థనలన్నీ కేవలం మసీదుల లోపల మాత్రమే నిర్వహించాలని ఇస్లామిక్ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది.
దేశవ్యాప్త భద్రతా ముందస్తు చర్యల్లో భాగంగా జాతీయ అత్యవసర సంక్షోభ మరియు విపత్తు నిర్వహణ అథారిటీ (NCEMA) సమన్వయంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. భక్తుల రక్షణ మరియు ప్రార్థనల సజావుగా నిర్వహణే లక్ష్యంగా ఈ పరిమితులు విధించినట్లు అధికారులు తెలిపారు. పవిత్ర రంజాన్ ముగింపు సందర్భంగా జరిగే ఈ ప్రత్యేక ప్రార్థనల కోసం దేశవ్యాప్తంగా ఉన్న మసీదులు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. భక్తులందరూ అధికారిక మార్గదర్శకాలను పాటిస్తూ, భద్రతా సిబ్బందికి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.