Video: కుప్ప‌కూలిన‌ కార్గో విమానం.. 20 మంది మృతి

అజర్‌బైజాన్ నుండి బయలుదేరిన తర్వాత నిన్న జార్జియాలో కనీసం 20 మంది సిబ్బందితో ప్రయాణిస్తున్న టర్కిష్ సి-130 సైనిక కార్గో విమానం కూలిపోయింది

By -  Knakam Karthik
Published on : 12 Nov 2025 9:57 AM IST

International News, Georgia, Turkish, Military Cargo Plane Crashes

Video: గాల్లోనే కూలిన కార్గో విమానం, 20 మంది మృతి

అజర్‌బైజాన్ నుండి బయలుదేరిన తర్వాత నిన్న జార్జియాలో కనీసం 20 మంది సిబ్బందితో ప్రయాణిస్తున్న టర్కిష్ సి-130 సైనిక కార్గో విమానం కూలిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. సి-130 మోడల్‌కు చెందిన ఆ టర్కీ సైనిక విమానంలో మొత్తం 20 మంది సిబ్బంది ఉన్నారని సమాచారం. అజర్‌బైజాన్‌ నుంచి స్వదేశానికి తిరిగి వస్తుండగా, జార్జియాలోని సిగ్నాఘి ప్రాంతం వద్ద ఇది గాల్లోనే మంటలు చెలరేగడంతో నియంత్రణ తప్పి కూలిపోయింది. మంటలు, పొగలు చుట్టుముట్టిన కారణంగా విమానంలోని అందరూ ప్రాణాలు కోల్పోయారు.

ఈ విషాద ఘటనను టర్కీ రక్షణ శాఖతో పాటు జార్జియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలు కూడా ధృవీకరించాయి. ప్రమాద స్థలంలో సహాయక బృందాలు తక్షణమే చేరి రక్షణ చర్యలు ప్రారంభించాయి. అయితే, ప్రమాదం తీవ్రత దృష్ట్యా విమానంలోని 20 మంది సైనిక సిబ్బందంతా మరణించినట్లు టర్కీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

జార్జియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సైతం ఈ ప్రమాదాన్ని ధ్రువీకరించింది. అజర్‌బైజాన్ సరిహద్దుకు సుమారు 5 కిలోమీటర్ల దూరంలోని సిగ్నాఘి ప్రాంతంలో విమానం కూలిపోయిందని తెలిపింది. జార్జియా గగనతలంలోకి ప్రవేశించిన కొన్ని నిమిషాలకే విమానం రాడార్ నుంచి అదృశ్యమైందని, ఎలాంటి ప్రమాద సంకేతాలు జారీ చేయలేదని దేశ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏజెన్సీ ‘సకేరోనావిగాట్సియా’ పేర్కొంది. ఈ సీ-130 హెర్క్యులస్ విమానాన్ని అమెరికాకు చెందిన లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ తయారు చేస్తుంది.

Next Story