హెచ్1బీ వీసాలపై తొలగిన నిషేధం
Trump's H-1B visa ban has expired. ట్రంప్ హెచ్-1బీ సహా ఇతర నాన్ ఇమ్మిగ్రేంట్ వర్క్ వీసాలపై విధించిన నిషేధం బుధవారం అర్థరాత్రితో ముగిసింది.
By Medi Samrat Published on 2 April 2021 3:18 AM GMTఅమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ సహా ఇతర నాన్ ఇమ్మిగ్రేంట్ వర్క్ వీసాలపై విధించిన నిషేధం బుధవారం అర్థరాత్రితో ముగిసింది. దీనిని పొడిగించే ప్రసక్తే లేదన్న బిడెన్ ప్రకటనతో అగ్రరాజ్యంలో ఉద్యోగాలు చేయాలనుకునే విదేశీ నిపుణులకు భారీ ఊరట లభించింది.
కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో అమెరికన్ల ఉద్యోగాలకు రక్షణ కల్పించే చర్యల్లో భాగంగా ట్రంప్ నిరుడు జూన్‌లో హెచ్1బీ సహా పలు వలసేతర వీసాల జారీని నిలిపివేశారు. గత డిసెంబరు 31 వరకు ఆ ఆదేశాలు అమల్లో ఉంటాయని ప్రకటించారు. అయితే అధ్యక్ష పదవి నుంచి దిగిపోయేముందు ఆ ఆంక్షలను ఈ ఏడాది మార్చి 31 వరకు పొడిగిం చారు.
పలు విషయాలలో ట్రంప్ అనుసరించిన కఠిన విధానాలను మంగళం పాడే క్రమంలో ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా హెచ్1బీ వీసాలపై నిషేధాన్ని పొడిగించకుండా.. ట్రంప్ ఆదేశాలు మురిగిపోయేలా చేశారు. దీంతో కొత్తగా హెచ్1బీ వీసాల జారీకి ఆటంకాలు తొలిగిపోయినట్లయింది. కాగా, మౌలిక సదుపాయాల కల్పనకు, చైనా నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు 1.46 కోట్ల కోట్లతో పెట్టుబడి ప్రణాళికను బైడెన్ ప్రతిపాదించారు. ఈ పెట్టుబడుల మొత్తంతో చక్కటి ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు ఆర్థిక పురోగతి సాధ్యపడుతుందని ఆయన భావిస్తున్నారు.
ఇదిలాఉంటే.. 2022 ఏడాదికి గాను హెచ్-1బీ వీసాలకు సంబంధించి ప్రాథమిక దరఖాస్తుల స్వీకరణ పూర్తైందని, ఏప్రిల్ 1 నుంచి అర్హులైన వారు పిటిషన్ దాఖలు చేసుకోవాలని తాజాగా యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ప్రకటించింది.