అమెరికాలో భారీ రిఫైనరీ.. భారత్‌కు థాంక్స్ చెప్పిన ట్రంప్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఒక భారీ ప్రకటన చేశారు. గత అర్థ శతాబ్ద కాలంలో (50 ఏళ్లలో) అమెరికాలో నిర్మించ తలపెట్టిన...
By - అంజి |
అమెరికాలో భారీ రిఫైనరీ.. భారత్‌కు థాంక్స్ చెప్పిన ట్రంప్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఒక భారీ ప్రకటన చేశారు. గత అర్థ శతాబ్ద కాలంలో (50 ఏళ్లలో) అమెరికాలో నిర్మించ తలపెట్టిన మొట్టమొదటి కొత్త ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్టుకు భారత్, రిలయన్స్ సంస్థ మద్దతు తెలపడంపై ఆయన ధన్యవాదాలు ప్రకటించారు. టెక్సాస్‌లోని బ్రౌన్స్‌విల్లే పోర్ట్ వద్ద నిర్మించనున్న ఈ ప్రాజెక్టు విలువ సుమారు 300 బిలియన్ డాలర్లు (సుమారు ₹25 లక్షల కోట్లు) అని, ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందమని ట్రంప్ పేర్కొన్నారు.
"మా భాగస్వామి అయిన భారత్‌కు, అలాగే అక్కడి అతిపెద్ద ప్రైవేట్ ఇంధన సంస్థ రిలయన్స్‌కు ఈ భారీ పెట్టుబడి పెట్టినందుకు ధన్యవాదాలు" అని ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' వేదికగా పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా అమెరికా తిరిగి 'నిజమైన ఇంధన ఆధిపత్యాన్ని' సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇది ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన రిఫైనరీగా నిలుస్తుందని చెప్పారు. ఈ భారీ ప్రాజెక్టు వల్ల దక్షిణ టెక్సాస్ ప్రాంతంలో వేలాది మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది పెద్ద ఊతమిస్తుందని వివరించారు.
తమ ప్రభుత్వ విధానాలు, పన్ను తగ్గింపులు మరియు అనుమతుల సరళీకరణ వల్లే బిలియన్ డాలర్ల పెట్టుబడులు తిరిగి అమెరికాకు వస్తున్నాయని ట్రంప్ క్రెడిట్ తీసుకున్నారు. మధ్యప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఈ ప్రకటన రావడం గమనార్హం. హోర్ముజ్ జలసంధి గుండా చమురు రవాణా నిలిచిపోవడంతో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో సొంతంగా ఇంధన ఉత్పత్తిని పెంచుకోవడం ద్వారా అమెరికా తన జాతీయ భద్రతను పటిష్టం చేసుకోవాలని భావిస్తోంది.