తగ్గేదే లేదంటున్న ట్రంప్.. 10 శాతం గ్లోబల్ టారిఫ్ విధిస్తూ సంచలన నిర్ణయం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రపంచ దేశాలపై టారిఫ్ (సుంకాల) యుద్ధాన్ని ప్రకటించారు.

By -  అంజి
Published on : 21 Feb 2026 7:24 AM IST

Donald Trump, US Tariffs, Global 10% Tariff, Supreme Court Ruling, Section 122 Trade Act, Import Duties, US-China Trade, Economic Policy 2026

తగ్గేదే లేదంటున్న ట్రంప్.. 10 శాతం గ్లోబల్ టారిఫ్ విధిస్తూ సంచలన నిర్ణయం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రపంచ దేశాలపై టారిఫ్ (సుంకాల) యుద్ధాన్ని ప్రకటించారు. సుప్రీంకోర్టు ఆయన తీసుకున్న పాత నిర్ణయాన్ని కొట్టివేసిన కొద్ది గంటల్లోనే, ట్రంప్ తన 'ట్రేడ్ అజెండా'ను మరింత ఉధృతం చేస్తూ సరికొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. అమెరికా సుప్రీంకోర్టు నుండి ఎదురుదెబ్బ తగిలినా వెనక్కి తగ్గని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, శుక్రవారం ఓవల్ ఆఫీస్ నుండి ప్రపంచంలోని అన్ని దేశాల దిగుమతులపై 10% గ్లోబల్ టారిఫ్‌ను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కొత్త పన్ను దాదాపు వెంటనే అమలులోకి వస్తుందని ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' వేదికగా ప్రకటించారు. 1974 ట్రేడ్ యాక్ట్ లోని 'సెక్షన్ 122' ప్రకారం ఈ సుంకాన్ని విధించారు. ఇది సుమారు 150 రోజుల (5 నెలలు) పాటు అమలులో ఉంటుంది. ఈ ఐదు నెలల కాలంలో ఇతర దేశాల వాణిజ్య విధానాలపై లోతైన విచారణ జరిపి, ఆ తర్వాత మరింత కఠినమైన లేదా 'న్యాయమైన' టారిఫ్లు విధిస్తామని ట్రంప్ పేర్కొన్నారు. అవసరమైతే ఈ పన్నులను ఇంకా పెంచే హక్కు తనకు ఉందని ఆయన స్పష్టం చేశారు.

అంతకుముందు, అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA) కింద ట్రంప్ విధించిన భారీ సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు 6-3 మెజారిటీతో కొట్టివేసింది. కాంగ్రెస్ ఆమోదం లేకుండా ఇలాంటి పన్నులు విధించడం చెల్లదని కోర్టు పేర్కొంది. "ఈ తీర్పు నన్ను తీవ్ర నిరాశకు గురిచేసింది. కోర్టులోని కొందరు సభ్యుల తీరు చూసి నేను సిగ్గుపడుతున్నాను" అని ట్రంప్ మండిపడ్డారు. కోర్టు తీర్పు కేవలం ఒక చట్టాన్ని మాత్రమే నియంత్రించిందని, అధ్యక్షుడిగా తనకు ఇతర ప్రత్యామ్నాయాలు ఉన్నాయని ట్రంప్ వాదించారు. "నేను వాణిజ్యాన్ని నాశనం చేయగలను, ఎంబార్గో (వాణిజ్య నిషేధం) విధించగలను, నేను ఏమైనా చేయగలను. కానీ ఒక్క డాలర్ పన్ను వసూలు చేయకూడదు అనడం హాస్యాస్పదంగా ఉంది" అని ఆయన వ్యాఖ్యానించారు.

గత ఏడాది కాలంగా ట్రంప్ ప్రభుత్వం సుంకాల రూపంలో సుమారు 175 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 14.5 లక్షల కోట్లు) ఆదాయాన్ని సేకరించింది. కోర్టు తీర్పుతో ఈ మొత్తాన్ని ఆయా దేశాలకు లేదా కంపెనీలకు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ రీఫండ్ ప్రక్రియపై ట్రంప్ మాట్లాడుతూ.. "ఇది రాబోయే రెండేళ్లపాటు కోర్టుల్లోనే ఉంటుంది" అని చెప్పారు, అంటే వెంటనే డబ్బులు ఇచ్చే ఉద్దేశ్యం లేదని సూచించారు. ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ, పాత చట్టం కింద ఆదాయం కోల్పోయినా, ఇప్పుడు కొత్తగా సెక్షన్ 122, 232 మరియు 301 కింద విధిస్తున్న సుంకాల వల్ల 2026 నాటికి వచ్చే ఆదాయంలో పెద్దగా మార్పు ఉండదని, ప్రభుత్వ ఖజానాకు నష్టం కలగదని ధీమా వ్యక్తం చేశారు.

Next Story