ఇరాన్‌పై 4 వారాల పాటు దాడులు.. పెద్ద దేశం కదా: ట్రంప్‌

పశ్చిమాసియాలో ముంచుకొస్తున్న యుద్ధ మేఘాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.

By -  అంజి
Published on : 2 March 2026 7:46 AM IST

Donald Trump, Operation Epic Fury, Iran-US Conflict 2026, Ayatollah Ali Khamenei Killed, US-Israel Strikes on Iran, Middle East War Crisis, US Service Members Casualties

ఇరాన్‌పై 4 వారాల పాటు దాడులు.. పెద్ద దేశం కదా: ట్రంప్‌

పశ్చిమాసియాలో ముంచుకొస్తున్న యుద్ధ మేఘాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌పై ప్రస్తుతం కొనసాగుతున్న సైనిక చర్య మరో నాలుగు వారాల పాటు కొనసాగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. 'డైలీ మెయిల్' పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేస్తూ.. ఇరాన్ వంటి పెద్ద దేశంపై ఆపరేషన్ పూర్తి కావడానికి కనీసం నెల రోజులు పడుతుందని అభిప్రాయపడ్డారు. అమెరికా - ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా చేపట్టిన ఈ భారీ సైనిక దాడులకు 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' అని పేరు పెట్టారు.

దీని గురించి ట్రంప్ ప్రస్తావిస్తూ.. ఇది ప్రపంచం ఇప్పటివరకు చూడని అత్యంత సంక్లిష్టమైన, శక్తివంతమైన సైనిక దాడి అని అభివర్ణించారు. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్‌లో ఇప్పటివరకు 200 మందికి పైగా మరణించారు. ఇరాన్ అత్యున్నత నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ తో పాటు 48 మంది ముఖ్య నేతలు ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారని ట్రంప్‌ అన్నారు. ఈ యుద్ధంలో ముగ్గురు అమెరికా సైనికులు మరణించారు. వీరిని ట్రంప్ 'నిజమైన దేశభక్తులు'గా కొనియాడారు. భవిష్యత్తులో ప్రాణనష్టం పెరిగే అవకాశం ఉందని కూడా ఆయన అంగీకరించారు.

దాడులు జరుగుతున్నప్పటికీ, ఇరాన్‌తో చర్చలకు తలుపులు తెరిచే ఉన్నాయని.. అయితే అది సరైన సమయంలో జరగాలని ట్రంప్ స్పష్టం చేశారు. "ఇరాన్ వద్ద ఉన్న లాంగ్ రేంజ్ క్షిపణులు, అణు ఆయుధాలు అమెరికాకు పెను ముప్పు. మా లక్ష్యాలన్నీ నెరవేరే వరకు ఈ పోరాటం పూర్తి స్థాయిలో కొనసాగుతుంది" అని ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' వేదికగా హెచ్చరించారు. ఇప్పటికే సౌదీ అరేబియా, యూఏఈ, జోర్డాన్ వంటి దేశాల నేతలతో ట్రంప్ ఈ పరిస్థితులపై చర్చించినట్లు తెలిపారు.

Next Story