బైడెన్ పై ట్రంప్ ప్రశంసలు.. ఎందుకంటే..?

Trump praises Biden.ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా సేనలను వెనక్కి తీసుకోవాలన్న బైడన్ నిర్ణయాన్ని స్వాగతించిన ట్రంప్.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 April 2021 2:34 AM GMT
trump, Biden

నిన్న మొన్నటి వరకు అవకాశం దొరికినా, దొరకక పోయినా అధ్యక్షుడు బైడెన్ మీద తిట్ల వర్షం, విమర్శల వరద కురిపించే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు పొగిడి పడేస్తున్నాడు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా సేనలను వెనక్కి తీసుకోవాలన్న బైడన్ నిర్ణయాన్ని స్వాగతించిన ట్రంప్.. అయితే, అందుకు విధించిన గడువు విషయంలో మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. సెప్టెంబరు 11వ తేదీ లోపు ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా సేనలను పూర్తిగా వెనక్కి రప్పిస్తామంటూ బైడెన్ ప్రభుత్వం గతవారం పేర్కొంది. ఆప్ఘనిస్థాన్‌ను విడిచిపెట్టడమనేది అద్భుతమైన, సానుకూల విషయమని ట్రంప్ ప్రశంసించారు. అయితే, ఇందుకోసం సెప్టెంబరు వరకు ఆగాల్సిన పనిలేదని, మే 1 నాటికి పూర్తిచేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

ఆప్ఘనిస్థాన్ నుంచి దళాలను వెనక్కి తీసుకునేందుకు సెప్టెంబరు 11ను గడువుగా పెట్టుకోవద్దనడానికి రెండు కారణాలున్నాయన్నారు . ఇందులో మొదటిది.. ఇప్పటికే 19 సంవత్సాల సుదీర్ఘ సమయం గడిచిపోయింది కాబట్టీ బ‌లగాలను వీలైనంత త్వరగా వెనక్కి రప్పించడం మంచిదన్నారు. ఇక సెప్టెంబర్ 11 అనేది ఓ విషాద ఘటనకు గుర్తు అని, ఆ రోజు తమ ప్రాణాలను కోల్పోయిన మననం చేసుకునేందుకు విడిచిపెట్టేయాలని కోరారు.

20 ఏళ్ల యుద్ధానికి ముగింపు పలకాలన్న బైడెన్ నిర్ణయాన్ని మాజీ అధ్యక్షులైన జార్జ్ డబ్ల్యూ బుష్, బరాక్ ఒబామాలు ఇప్పటికే ప్రశంచారు. ఇప్పుడు ట్రంప్ కూడా వారి సరసన చేరారు. బైడెన్ నిర్ణయాన్ని కొనియాడిన బరాక్ ఒబామా.. ఆఫ్ఘనిస్థాన్‌లో 20 ఏళ్ల యుద్ధానికి ముగింపు పలకాలనుకోవడం హర్షణీయమన్నారు. కాగా, బైడెన్‌ను ట్రంప్ ప్రశంసించడాన్ని సొంతపార్టీ నేతలే జీర్ణించుకోలేకపోతున్నారు. బైడెన్ నిర్ణయం గొప్పదీ కాదు, సానుకూలమూ కాదని కొట్టిపడేస్తున్నారు.


Next Story