అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పని చేస్తున్నాడు. క్యాపిటల్ భవనంపై దాడి తరువాత ప్రజలను రెచ్చగొట్టే పోస్టులు చేస్తున్నారంటూ ముందు ట్విటర్ తరువాత ఫేస్‌బుక్ ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ట్రంప్ ఖాతాలను నిర్దాక్షిణ్యంగా తొలగించేశాయి. దీంతో తానే సొంతంగా ఓ సోషల్ మీడియా సంస్థను ఏర్పాటు చేస్తాననంటూ అప్పట్లోనే ప్రకటించారు. ఖాతాలను తొలగించడంతో దాదాపు తొమ్మిది నెలల కాలంగా ఆయన సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు.
తాజాగా ట్రూత్ పేరుతో ఓ కొత్త సామాజిక మాధ్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ (టీఎంటీజీ) కింద 'ట్రూత్ సోషల్' అనే సోషల్ మీడియా సైట్ ను ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. వచ్చే నెలలో దీని బీటా వెర్షన్ అందుబాటులోకి రానుంది. ప్రీ ఆర్డర్ల కోసం ఇది ఇప్పటికే యాపిల్ యాప్‌స్టోర్‌లో అందుబాటులో ఉంటుందని చెప్పారు. పెద్ద టెక్ సంస్థల నిరంకుశ పోకడలను ఎదిరించేందుకు టీఎంటీజీ, ట్రూత్ సోషల్ ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తాలిబన్ల వంటి ఉగ్రవాద సంస్థలు ట్విట్టర్‌ను వాడుతున్నాయని.. ట్విటర్‌లో మీరు ఎంతో ప్రేమించే అమెరికా అధ్యక్షుడి నోరునొక్కేశారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ట్రంప్ పేర్కొన్నారు.
ఇక వీడియో ఆన్ డిమాండ్ సేవలకు కూడా ప్రారంభించాలని టీఎంటీజీ భావిస్తోంది. ఈ కంపెనీ ప్రాథమిక విలువను 875 మిలియన్ డాలర్లుగా తెలిపారు. భవిష్యత్తులో వ్యాపారాన్ని అనుసరించి ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందని చెప్పారు.