'దాడి చేస్తే ఊహించని వినాశనం తప్పదు'.. ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం

సుప్రీం లీడర్ ఖమేనీ మరణానికి ప్రతీకారంగా అమెరికా, ఇజ్రాయెల్‌లపై చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాడి చేస్తామని ఇరాన్...

By -  అంజి
Published on : 1 March 2026 12:00 PM IST

Donald Trump, Iran Crisis 2026, IRGC Warning, Khamenei Death, US-Israel Alliance, World War 3 Fears, Middle East Conflict, X Post Trump

'దాడి చేస్తే ఊహించని వినాశనం తప్పదు'.. ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం 

సుప్రీం లీడర్ ఖమేనీ మరణానికి ప్రతీకారంగా అమెరికా, ఇజ్రాయెల్‌లపై చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాడి చేస్తామని ఇరాన్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే డోనల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో స్పందించారు. "అమెరికా, ఇజ్రాయెల్‌లపై దాడులు చేస్తామని ఇరాన్ చెబుతోంది. ఒకవేళ వారు ఆ పని చేస్తే.. ఇరాన్ చరిత్రలో ఎన్నడూ చూడని రీతిలో, మునుపెన్నడూ లేని బలంతో మేము ఎదురుదాడి చేస్తాం" అని ట్రంప్ తన ఎక్స్‌ (ట్విట్టర్) ఖాతాలో హెచ్చరించారు. ఇరాన్ తన పరిమితులను దాటకూడదని, అమెరికా సైనిక శక్తిని తక్కువ అంచనా వేయవద్దని ఆయన స్పష్టం చేశారు.

ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) ఏమంది?

ఖమేనీ మరణాన్ని 'అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన ఉగ్రవాద చర్య'గా అభివర్ణించిన IRGC, ప్రతీకారం తీర్చుకుంటామని భీషణ ప్రతిజ్ఞ చేసింది. తమ నాయకుడిని చంపిన హంతకుల (అమెరికా, ఇజ్రాయెల్) అంతు చూస్తామని, చరిత్రలోనే అత్యంత భయంకరమైన సైనిక చర్యను చేపడతామని హెచ్చరించింది. ఖమేనీ చూపిన బాటలోనే ఇరాన్ సైన్యం, బాసిజ్ దళాలు నడుస్తాయని, అంతర్గత, బాహ్య కుట్రలను అణచివేస్తామని ప్రకటించింది.

అమెరికా - ఇజ్రాయెల్‌ దాడులతో 86 ఏళ్ల ఖమేనీ మరణించడం, దానికి తోడు ట్రంప్ ప్రకటనలతో ఇరాన్ రగిలిపోతోంది. అగ్రరాజ్యం తన సైనిక విభాగాలను ఇప్పటికే అప్రమత్తం చేయగా, ఇరాన్ కూడా భారీ క్షిపణి దాడులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ దేశాలు ఈ పరిణామాలను గమనిస్తూ ఉత్కంఠకు లోనవుతున్నాయి.

Next Story