అమెరికాలో భారీగా వీసాల రద్దు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో ఇమ్మిగ్రేషన్ అమలు చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.
By - అంజి |
అమెరికాలో భారీగా వీసాల రద్దు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో ఇమ్మిగ్రేషన్ అమలు చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. జాతీయ భద్రతా పరిశీలనను కఠినతరం చేసే ప్రయత్నాల భాగంగా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 85,000 వీసాలను రద్దు చేసినట్లు అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ మంగళవారం ప్రకటించింది. స్టేట్ డిపార్ట్‌మెంట్ ‘ఎక్స్’(మాజీ ట్విట్టర్) లో చేసిన పోస్టులో “జనవరి నుంచి 85,000 వీసాలు రద్దు చేశాం. అధ్యక్షుడు ట్రంప్, కార్యదర్శి రుబియో పాటించే మంత్రం ఒక్కటే - అమెరికాను మరింత సురక్షితంగా ఉంచడం. ఈ చర్యలు ఆగవు” అని వ్యాఖ్యానించింది.
ఈ సందేశంతో పాటు “Make America Safe Again” అన్న నినాదంతో డొనాల్డ్ ట్రంప్ ఉన్న చిత్రం కూడా షేర్ చేశారు. తాజా ప్రకటన ద్వారా వీసా రద్దు చర్యలు ట్రంప్ ప్రభుత్వ జాతీయ భద్రతా విధానంలో కీలకంగా మారాయని స్పష్టమైంది. స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రకారం, ఇమ్మిగ్రేషన్ మోసాలు, భద్రతా అనుమానాలు, వీసా నిబంధనల ఉల్లంఘన వంటి కారణాలతో భారీ సంఖ్యలో వీసాలు రద్దు చేసినట్లు తెలియజేశారు. అమెరికాలో కఠినమైన వీసా పరిశీలన, రద్దులపై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, ఉద్యోగార్థులు, ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది.