ఘోర రైలు ప్రమాదం.. 11 మంది మృతి
Train Crash in Egypt Kills at Least 11. ఈజిప్ట్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం 11 మందిని బలి తీసుకుంది.
By Medi Samrat Published on
19 April 2021 2:53 AM GMT

ఈజిప్ట్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం 11 మందిని బలి తీసుకుంది. రాజధాని కైరోకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న టోక్ అనే ఓ చిన్న పట్టణం వద్ద పాసింజార్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా, 98 మంది గాయపడ్డారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఈజిప్ట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. ఒకటి, రెండూ కాదు సుమారు 50కి పైగా అంబులెన్స్‌లు ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించాయి. గాయపడిన వారిలో ఎక్కువ సంఖ్యలో మైనర్లు ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది.
రైలు కైరో నుంచి మన్సోరా వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాదం జరగడానికి గల కారణాలపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. గత నెలలో కూడా ఈజిప్ట్‌లో రెండు రైళ్లు ఢీకొని 32 మంది మరణించగా, 165 మంది గాయపడ్డారు. ఈజీప్ట్ లో జరుగుతున్న వరుస రైలు ప్రమాదాలు నేతల నిర్లక్ష్యాన్ని బయటపెడుతున్నాయి అని స్థానికులు అంటున్నారు.
Next Story