పాక్‌లో విషాదం.. లోయలో పడ్డ బస్సు.. 28 మంది దుర్మరణం

పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. ఒక బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది.

By Srikanth Gundamalla  Published on  29 May 2024 2:16 PM IST
Tragedy,  Pakistan,  Bus accident,  28 people died,

పాక్‌లో విషాదం.. లోయలో పడ్డ బస్సు.. 28 మంది దుర్మరణం

పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. ఒక బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ సంఘటనలో ఏకంగా 28 మంది ప్రాణాలు కోల్పోయారు. లోయ ఎక్కువ లోతులో ఉండటంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని అక్కడి అధికారులు చెప్పారు.

పాకిస్థాన్‌లోని స్థానిక కథనాల ప్రకారం.. బలూచిస్థాన్‌లో బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. 54 మంది ప్రయాణికులతో బస్సు దక్షిణ బలూచిస్తాన్‌లోని టర్బాట్‌ నగరం నుంచి ఉత్తరాన 750 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని క్వెట్టాకు బయల్దేరింది. ఈ క్రమంలోనే కొండ ప్రాంతంలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కొండ ప్రాంతంలో మలుపు వద్ద బస్సు అదుపుతప్పింది. దాంతో.. డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయాడు. రోడ్డు పక్కకే ఉన్న లోయలో పడిపోయింది. ఈ సంఘటనలో డ్రైవర్‌ సహా మొత్తం 28 మంది స్పాట్‌లోనే చనిపోయారు. సుమారు 20 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లారు. క్షతగాత్రులను హెలికాప్టర్‌ సాయంతో దగ్గరున్న ఆస్పత్రులకు తరలించారు. డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యంగా బస్సు నడపడం వల్లే ప్రమాదం సంభవించిందని స్థానికులు చెప్పారు. ఈ ప్రమాదంపై పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకునేలా మెరుగైన చికిత్స అందించాలని అధికారులు, వైద్యులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.

Next Story