క్లోరిన్‌ గ్యాస్‌ లీకేజీ.. 13 మంది దుర్మ‌ర‌ణం

Toxic gas released in Jordan port kills 13.జోర్డాన్‌లోని దక్షిణ ఓడరేవు నగరమైన అకాబాలో సోమ‌వారం ప్ర‌మాదం చోటు చేసుకుంది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Jun 2022 9:05 AM IST
క్లోరిన్‌ గ్యాస్‌ లీకేజీ.. 13 మంది దుర్మ‌ర‌ణం

జోర్డాన్‌లోని దక్షిణ ఓడరేవు నగరమైన అకాబాలో సోమ‌వారం ప్ర‌మాదం చోటు చేసుకుంది. కోర్లిన్ గ్యాస్ లీక్ కావ‌డంతో 13 మందికి పైగా మ‌ర‌ణించ‌గా.. 251 మంది గాయ‌ప‌డ్డార‌ని ఆదేశ‌ ప్రభుత్వ ప్రతినిధి ఫైసల్ అల్-షాబౌల్ తెలిపారు.

జిబౌటికి ఎగుమతి చేస్తున్న 25 టన్నుల క్లోరిన్‌ గ్యాస్‌తో నిండిన ట్యాంక్‌ను క్రేన్ సాయంతో ఓడ పైకి చేరుస్తుండ‌గా.. ఒక్క‌సారిగా క్రేన్ నుంచి ట్యాంక‌ర్ విడిపోయి కింద‌ప‌డిపోయింది. పెద్ద శ‌బ్ధంతో పేలుడు సంభ‌వించింది. మ‌రియు ట్యాంక్‌లోని క్లోరిన్ వాయువు బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. అందులో ప‌సువు రంగు పొగతో ఆ ప్రాంతం మొత్తం నిండిపోవ‌డం క‌నిపిస్తుంది.

ఈ ఘ‌ట‌న‌తో అప్ర‌మ‌త్తమైన అధికారులు వెంట‌నే ఆ ప్రాంతాన్ని మూసివేశారు. గ్యాస్ లీకేజీని అరిక‌ట్ట‌డానికి నిపుణుల‌ను అక్క‌డికి పంపించారు. మ‌రో వైపు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. గాయ‌ప‌డిన వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ప్ర‌స్తుతం 199 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని స్థానిక మీడియా సంస్థ వెల్ల‌డించింది.

స్థానిక ఆరోగ్య అధికారి డాక్టర్ జమాల్ ఒబీదత్ మాట్లాడుతూ.. ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితుల్లో ప్ర‌జలంతా ఇళ్ల‌లోనే ఉండాల‌ని, కిటీకీలు, త‌లుపులు మూసివేయాల‌ని సూచించారు. ఘ‌ట‌న జ‌రిగిన ప్రాంతం నివాస ప్రాంతాల‌కు ద‌గ్గ‌ర‌లోనే ఉండ‌డంతో ఈ సూచ‌న‌లు చేశారు.

స‌మాచారం అందుకున్న ప్ర‌ధాన మంత్రి బిషర్ అల్-ఖాసావ్నే అకాబాకు వెళ్లారు. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న వారిని ప‌రామ‌ర్శించారు. అంతర్గత మంత్రి అధ్యక్షతన ఈ ఘటనపై అల్-ఖాసావ్నే దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచార మంత్రి తెలిపారు.

Next Story