బీరు సీసాలతో ఆలయం.. ఎందుకు నిర్మించారంటే?
This Buddhist temple is made of a million beer bottles. థాయ్‌లాండ్‌లోని వాట్ పా మహా చెడి కైవ్ అనే బౌద్ధ దేవాలయాన్ని చూస్తే.. మీరు తప్పకుండా
By అంజి Published on 29 Jan 2023 5:30 PM IST
థాయ్‌లాండ్‌లోని వాట్ పా మహా చెడి కైవ్ అనే బౌద్ధ దేవాలయాన్ని చూస్తే.. మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ ఆలయాన్ని పూర్తిగా బీరుసీసాలతో నిర్మించారు. థాయ్‌లాండ్‌లోని సిసాకేట్ ప్రావిన్స్‌లోని ఖున్ హాన్ జిల్లాలో ఉన్న ఈ ఆలయం పూర్తిగా మిలియన్ కంటే ఎక్కువ బీర్ బాటిళ్లతో తయారు చేయబడింది. ఈ సీసాలు హీనెకెన్, చాంగ్ అనే స్థానిక బీర్లకు చెందినవి. 1984 నాటికి ముందు థాయ్ బీచ్‌లలో ఎక్కడా చూసినా వాడి పారేసినా బీరు సీసాలే కనిపించేవి.
1984లో సముద్రంలో నిత్యం పెరుగుతున్న చెత్తాచెదారానికి విసిగిపోయిన బౌద్ధ సన్యాసులు ఆలయ సముదాయాన్ని నిర్మించడానికి ఖాళీ బీరు బాటిళ్లను సేకరించడం ప్రారంభించారు. ఆ తర్వాత రెండేళ్లలో ఆలయాన్ని నిర్మించారు. ఆలయ సముదాయం వద్ద వాష్‌రూమ్‌లు, స్లీపింగ్ క్వార్టర్స్, శ్మశానవాటిక అన్నీ బీర్ బాటిళ్లతో నిర్మించబడ్డాయి. బుద్ధుని మొజాయిక్‌లు కూడా రీసైకిల్ చేసిన బీర్ బాటిల్ క్యాప్‌లతో రూపొందించబడ్డాయి. ఈ సీసాలు ఎప్పుడూ రంగును కోల్పోవు. ఆలయ సముదాయంలో మంచి లైటింగ్‌ను అందిస్తాయి.
2009 వరకు ఈ ప్రాంగణంలో బీరు సీసాలతో ఇరవై కట్టడాలను నిర్మించారు. 'వాట్ పా మహా చెడి కేవ్' అని పిలువబడే ఈ ఆలయం.. మిలియన్ బాటిల్ టెంపుల్‌గా ప్రసిద్ధి చెందింది. సీసాలతో ఆలయం నిర్మించడానికి ముందు.. ఇక్కడ ఓ బౌద్ధ ఆలయం శిథిలావస్థలో ఉండేది. దానిని సీసాలతో నిర్మాణం చేపట్టి జీర్ణోద్ధరణ చేశారు. ఈ ఆలయ నిర్మాణానికి స్థానికులతో పాటు థాయ్‌లాండ్ ప్రభుత్వం కూడా లక్షల బీరు సీసాలను పంపింది. ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో ఈ సీసాల ఆలయం ప్రత్యేక ఆకర్షణగా ఉంది. థాయ్‌లాండ్‌కు వచ్చే పర్యాటకుల్లో చాలా మంది ఇక్కడికి వచ్చి పోతుంటారు.