రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య శాంతి నెలకొనాలని ప్రపంచ దేశాలు ఆకాంక్షిస్తున్నాయి. రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపేందుకు పలు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం మార్చి 7వ తేదీన రష్యా - ఉక్రెయిన్ మధ్య మూడో దఫా చర్చలు జరగనున్నాయి. ఇప్పటి వరకు జరిగిన రెండు విడతల చర్చలు విఫలం అయ్యాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడం వల్ల తలెత్తిన రక్తపాత సంఘర్షణకు ముగింపు పలికేందుకు మాస్కో, కైవ్‌ల మధ్య చర్చలు సోమవారం తిరిగి ప్రారంభమవుతాయని ఉక్రెయిన్ సంధానకర్త డేవిడ్ అరాఖమియా శనివారం తెలిపారు.
"మూడో రౌండ్ చర్చలు సోమవారం జరుగుతాయి" అని అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ పార్టీ పార్లమెంటరీ నాయకుడు, చర్చలకు ప్రతినిధి అయిన అరాఖమియా తన ఫేస్‌బుక్ పేజీలో తెలిపారు. తమ దేశంపై ఆంక్షలు విధించడం అంటే యుద్ధం ప్రకటించడం లాంటిదేనంటూ నిన్న రష్యా అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో వైపు ఉక్రెయిన్ - రష్యా యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపెడుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ హెచ్చరించింది. మరోవైపు రష్యా దాడులతో సుమారు 15 లక్షల మంది ఉక్రేనియన్ శరణార్థులు పశ్చిమ దేశాల వైపు వెళ్లారు.