అమెరికా బలగాలు తరలింపు.. బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
The sooner we finish the better says Joe Biden.అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్నప్పటి నుంచి తీవ్ర
By తోట వంశీ కుమార్
అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్నప్పటి నుంచి తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆ దేశం విడిచి వెళ్లేందుకు అఫ్గాన్ పౌరులతో పాటు విదేశాలకు చెందిన వ్యక్తులు కాబూల్ విమానాశ్రయానికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఇప్పటికే అఫ్గాన్‌లో చిక్కుకున్న విదేశీయుల తరలింపు ప్రక్రియను అన్ని దేశాలు వేగవంతం చేశాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉత్కంఠకు తెరదించారు. అమెరికా బలగాలను ముందుగా అనుకున్న ప్రకారం ఆగస్టు 31లోగా ఉపసంహరిస్తామని చెప్పారు.
డెడ్ లైన్ లోగా మిషన్ పూర్తి చేస్తామని బైడెన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం కాబూల్ విమానాశ్రయంలో 5800 మంది అమెరికా సైనికులు ఉన్నారు. వారు ఎంత త్వరగా వచ్చేస్తే అంత మంచిదని బైడెన్ అభిప్రాయపడ్డారు. ఒక్కో రోజు గడుస్తున్నా కొద్ది వారికి ముప్పు పెరుగుతుందన్నారు. తమ పనులకు తాలిబన్ల అడ్డుపడకుండా ఉంటే.. తమ పని ఇంకా తొందరగా పూర్తి అవుతుందని చెప్పారు. ఒకవేళ గడువును పొడిగించాల్సిన పరిస్థితి తలెత్తినప్పుడు తన జాతీయ భద్రతా బృందాన్ని ఆకస్మిక ప్రణాకలను రూపొందించమని కోరారు.
ఆగస్టు 31 తర్వాత అమెరికా బలగాలను అఫ్గనిస్తాన్‌లో ఉండేందుకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతినివ్వబోమని తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ చెప్పిన నేపథ్యంలో.. తాలిబన్ల సహకారంతోనే బలగాల ఉపసంహరణ కొనసాగాలంటూ బైడెన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.