క్వెట్టా: బలోచిస్తాన్ రాష్ట్రం మస్తుంగ్ జిల్లాలోని దాష్త్ ప్రాంతంలో సోమవారం జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. రైలుపై ప్రయాణిస్తున్న సమయంలో ట్రాక్ వద్ద పేలుడు సంభవించగా, రైలు బోగీలు ఒరిగిపోయాయి. కనీసం మూడు కోచ్‌లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రక్షణ బృందాలు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకొని చిక్కుకుపోయిన ప్రయాణికులను బయటకు తీయడం ప్రారంభించాయి. అందులో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. అయితే, మృతుల సంఖ్య, గాయాల వివరాలు స్పష్టంగా తెలియలేదు.
ఈ దాడి కొన్ని గంటల ముందే అదే ట్రాక్ మార్గంలో పాకిస్తాన్ సైనికులపై కూడా బాంబు దాడి జరగడం ఆందోళన కలిగిస్తోంది. వరుస దాడులు బలోచిస్తాన్‌లో రవాణా మార్గాల భద్రతపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తాయి. ఇక, ఈ ఏడాది మార్చి 11న కూడా జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై తీవ్రవాదులు దాడి చేసి, 6 మంది సైనికులను హతమార్చడమే కాకుండా, సుమారు 450 మంది ప్రయాణికులను బందీలుగా పట్టుకున్నారు. ఆ దాడికి బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) బాధ్యత వహిస్తూ, మరిన్ని దాడుల హెచ్చరికలు చేసింది. బలోచిస్తాన్‌లో వేర్పాటువాద హింసా చర్యలు కొనసాగుతుండటంతో రైల్వే ప్రయాణాలపై మరింత భయం నెలకొంది.