ఎప్పటి నుంచో వెతుకుతున్న కొత్త ఉద్యోగంలో చేరడానికి కొన్ని గంటల ముందు హైదరాబాదీ యువకుడు సౌదీ అరేబియాలో మరణించాడు. హైదరాబాద్‌లోని టోలీ చౌకీ సమీపంలోని హకీంపేటకు చెందిన మహ్మద్ ముజాహీద్ అలీ (37) ఆదివారం రాజధాని రియాద్‌లోని మర్ఫౌ జిల్లాలోని తన వసతి గృహంలో శవమై కనిపించాడు. ఆదివారం నాడు అతడు కొత్త కంపెనీలో చేరాల్సి ఉంది. అయితే, అతను ఉదయం రియాద్‌లోని తన కొత్త ఇంటి మెట్లపై అనుమానాస్పదరీతిలో శవమై కనిపించాడు. అతడు చనిపోయిన విషయాన్ని ఇరుగుపొరుగు వారు గమనించారు.
స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. పోలీసులు వచ్చి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. అక్కడ గుండెపోటుతో ముజాహీద్ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడు కొంతకాలంగా దమ్మామ్‌లో పనిచేస్తున్నాడని, అతను మరణించిన అదే రోజున కొత్త కంపెనీలో జాయిన్ కావాల్సి ఉందని, ఇంతలోనే ఇలా జరిగిందని కుటుంబ వర్గాలు తెలిపాయి. మృతుడికి భార్య, తల్లిదండ్రులు ఉన్నారు. వారు రియాద్‌లోని ప్రముఖ కమ్యూనిటీ వర్కర్ అయిన అబ్దుల్ జబ్బార్‌ను డెత్ ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి సహాయం కోరారు. మృతదేహాన్ని ఒకటి లేదా రెండు రోజుల్లో అంత్యక్రియలు నిర్వహిస్తారని జబ్బార్ చెప్పారు.