దంపతులకు 12,640 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు.. నేరాన్ని ఒప్పుకోవడంతో..
తమ దగ్గర డబ్బులు పొదుపు చేస్తే.. తిరిగి ఎన్నో రెట్ల సోమ్ము పొందొచ్చని థాయ్‌లాండ్‌కు చెందిన దంపతులు సోషల్ మీడియాలో ప్రచారం
By అంజి Published on 14 May 2023 3:01 AM GMTదంపతులకు 12,640 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు.. నేరాన్ని ఒప్పుకోవడంతో..
తమ దగ్గర డబ్బులు పొదుపు చేస్తే.. తిరిగి ఎన్నో రెట్ల సోమ్ము పొందొచ్చని థాయ్‌లాండ్‌కు చెందిన దంపతులు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అయితే దంపతులను నమ్మి చాలా మంది పెట్టుబడి పెట్టారు. చివరకు ఆ దంపతులు పెట్టుబడి పెట్టిన వారిని మోసం చేశారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి విచారించిన థాయ్‌లాండ్ కోర్టు.. ఆ దంపతులకు 12,640 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. ఆన్‌లైన్ పోంజి స్కీం పేరుతో దంపతులు సోషల్ మీడియాలో మోసానికి పాల్పడ్డారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 2019లో వాంటనీ తిప్పావెత్, మేతి చిన్పా పాంజీ దంపతులు ఈ మోసానికి తెరలేపారు. తమ దగ్గర డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే వాటిపై 96 శాతం రిటర్న్స్ పొందొచ్చని, దాంతో తక్కువ టైంలోనే మిలియనీర్లు కావచ్చొంటూ, తమ పోంజి స్కీమ్‌లో చేరాలంటూ సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేశారు.
నకిలీ వీడియోలను రూపొందించి జనాలను ప్రలోభ పెట్టారు. ఇన్వెస్ట్ చేసిన వారి డబ్బుతో తాము ఒక బంగారు ఆభరణాల షాప్ కొనుగోలు చేశానంటూ రకరకాల నగలు ధరిస్తూ వాంటనీ ఆ వీడియోలో చూపిస్తూ రెచ్చగొట్టారు. వారి మాయ మాటలను నమ్మి 2500 మందికిపైగా వారి స్కీమ్‌లో పెట్టుబడి పెట్టారు. చివరకు 51.3 మిలియన్ డాలర్ల సేకరించి తర్వాత దంపతులు చెక్కేశారు. దీంతో వీరిపై కేసు నమోదు చేసి విచారించారు. థాయ్ లాండ్ క్రిమినల్ కోర్టు వీరికి 12,640 ఏళ్ల జైలు శిక్ష విధించింది. నిందితులు నేరాన్ని ఒప్పుకోవడంతో ఆ జైలు శిక్షను 5,056 ఏళ్లకు తగ్గించారు. అయితే థాయ్ లాండ్ చట్టం ప్రకారం దంపతులు.. ఒక్కొక్కరు 20 ఏళ్లు మాత్రమే ఆ దేశం జైలులో ఉంటారని ఒక అధికారి తెలిపారు.