ఒక్కసారిగా కుప్పకూలిపోయిన థాయ్‌ యువరాణి.. ఆసుపత్రిలో చేరిక

Thai Princess Bajrakitiyabha hospitalised with heart problem, says palace. థాయ్‌ యువరాణి బజ్రకితియాభా అస్వస్థతకు గురయ్యారు. థాయిలాండ్‌ సైన్యం నిర్వహించిన

By అంజి  Published on  16 Dec 2022 4:12 AM GMT
ఒక్కసారిగా కుప్పకూలిపోయిన థాయ్‌ యువరాణి.. ఆసుపత్రిలో చేరిక

థాయ్‌ యువరాణి బజ్రకితియాభా అస్వస్థతకు గురయ్యారు. థాయిలాండ్‌ సైన్యం నిర్వహించిన వర్కింగ్ డాగ్ ఛాంపియన్‌షిప్‌కు హాజరైన ఆమె ఒక్కసారిగా కుప్పకూలి స్పృహ కోల్పోయారని ప్యాలెస్ తెలిపింది. ''థాయ్‌లాండ్ రాజు మహా వజిరాలాంగ్‌కార్న్ పెద్ద కుమార్తె గుండె సంబంధిత సమస్య కారణంగా ఆసుపత్రిలో చేరారని, ఆమె పరిస్థితి కొంత స్థిరంగా ఉంది'' అని థాయిలాండ్‌ రాయల్‌ ప్యాలెస్‌ గురువారం తెలిపింది. ఈశాన్య నఖోన్ రాట్చాసిమా ప్రావిన్స్‌లో బుధవారం తెల్లవారుజామున స్పృహ కోల్పోయిన యువరాణి బజ్రకితియాభా (44) అనారోగ్యంతో బాధపడుతూ స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందారు.

ఆమె ప్రథమ చికిత్స అనంతరం హెలికాప్టర్‌లో బ్యాంకాక్‌కు తరలించారు. బ్యాంకాక్‌లోని చులాలాంగ్‌కార్న్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే యువరాణి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపిన రాయల్‌ ప్యాలెస్.. అసలు ఏమైందన్న పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు. అధికారిక బిరుదులను కలిగి ఉన్న రాజు వజిరాలాంగ్‌కార్న్ ముగ్గురు పిల్లలలో యువరాణి ఒకరు, ఆమె 1924 ప్యాలెస్ వారసత్వ చట్టం, దేశ రాజ్యాంగం ప్రకారం సింహాసనానికి అర్హత సాధించింది. థాయ్‌ దేశ న్యాయ సంస్కరణల్లో యువరాణి కీలక పాత్ర పోషించారు.

2016లో రాజు అయినప్పటి నుండి కింగ్ వజిరాలాంగ్‌కార్న్ ఇంకా అధికారికంగా వారసుడిని నియమించలేదు. యువరాణి సింహాసనాన్ని అధిష్టించే అవకాశంపై అధికారిక చర్చ జరగలేదు. ఐక్యరాజ్యసమితితో కలిసి పనిచేసిన యువరాణి, ఆస్ట్రియా, స్లోవేనియా, స్లోవేకియాలో థాయ్‌లాండ్ రాయబారిగా పనిచేశారు. రాజభవన వారసత్వ చట్టం సింహాసనానికి వారసుడు మగవారై ఉండాలని నిర్దేశిస్తున్నప్పటికీ, 1974లో రాజ్యాంగ సవరణ ద్వారా వారసుడి పేరు లేకుంటే రాజ వంశానికి చెందిన కుమార్తె సింహాసనాన్ని అధిష్టించడానికి అనుమతించింది.

Next Story