విమానం ఇంజిన్‌లో పడి వ్యక్తి మృతి
అమెరికాలోని టెక్సాస్‌లో విషాద ఘటన వెలుగు చూసింది. విమానం ఇంజిన్‌లో పడి.. ఎయిర్ పోర్టు వర్కర్ మృతి చెందాడు.
By అంజి Published on 27 Jun 2023 5:00 AM GMTవిమానం ఇంజిన్‌లో పడి వ్యక్తి మృతి
అమెరికాలోని టెక్సాస్‌లో విషాద ఘటన వెలుగు చూసింది. విమానం ఇంజిన్‌లో పడి.. ఎయిర్ పోర్టు వర్కర్ మృతి చెందాడు. శాన్ యాంటోనియో ఎయిర్‌పోర్టులో గత శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. లాస్ ఏంజెల్స్ నుండి వచ్చిన డెల్టా ఎయిర్‌లైన్స్ విమానం అరైవల్ గేట్ దగ్గరకు చేరుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని నేషనల్ ట్రాన్స్‌పోర్టు సేఫ్టీ బోర్డు (ఎన్‌టీఎస్‌బీ) తెలిపింది. అప్పటికి విమానంలోని ఓ ఇంజిన్ ఆన్‌లోనే ఉంది. గాలితో పాటూ 27 ఏళ్ల విమానాశ్రయ ఉద్యోగిని ప్యాసింజర్ విమానం ఇంజిన్ లోపలికి పీల్చుకుంది. దీంతో అతడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ మరణం భద్రతా విధానాల గురించి ఆందోళనలకు దారితీసింది. ఈ ఘటనపై డెల్టా ఎయిర్‌లైన్స్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. తమ ఏవియేషన్ కుటుంబ సభ్యుడి ప్రాణం కోల్పోయినందుకు గుండె పగిలింది అని వ్యాఖ్యానించింది.
27 ఏళ్ల మృతుడు యూనిఫీ అనే కంపెనీలో పని చేసేవాడు. ఈ కంపెనీ ఎయిర్‌పోర్టులో గ్రౌండ్ హ్యాండ్లింగ్‌కు సంబంధించిన బాధ్యతలు నిర్వహిస్తోంది. అయితే ఈ ఘటనకు, యూనిఫీ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని నేషనల్ సేఫ్టీ ట్రాన్స్‌పోర్టు బోర్డు తెలిపింది. ఘటన జరిగిన సమయంలో భద్రతాపరమైన నిబంధనల ఉల్లంఘన జరగలేదని పేర్కొంది. "విమానం లేదా విమానాశ్రయంతో కార్యాచరణ భద్రతా సమస్యలు లేవు" అని అధికారులు సోమవారం తెలిపారు. గతేడాది అలబామాలోని విమానాశ్రయంలోనూ ఇలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ ఉద్యోగిని విమానం ఇంజిన్ లోపలికి లాగేసుకోవడంతో అతడు దుర్మరణం చెందాడు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన అనంతరం అధికారులు సదరు విమానయాన సంస్థపై రూ.12.80 లక్షల జరిమానా విధించారు.