మాస్కోలో టెర్రర్ అటాక్‌.. 60 మంది మృతి

రష్యా రాజదాని మాస్కోలో దారుణం జరిగింది. భారీ ఉగ్రదాడి జరిగింది.

By Srikanth Gundamalla  Published on  23 March 2024 3:05 AM GMT
terror attack,  russia, moscow, 60 people died,

మాస్కోలో టెర్రర్ అటాక్‌.. 60 మంది మృతి

రష్యా రాజదాని మాస్కోలో దారుణం జరిగింది. భారీ ఉగ్రదాడి జరిగింది. క్రాకస్‌ సిటీ కన్సర్ట్‌ హాల్‌లోకి ప్రవేశించిన ఐదుగురు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ సంఘటనలో సుమారు 60 మంది చనిపోయినట్లు అక్కడి మీడియా చెబుతోంది. మరో 100 మందికి పైగా జనాలు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రముఖ రష్యన్‌ రాక్‌ బ్యాండ్‌ ఫిక్‌నిక్‌ సంగీత కార్యక్రమం నిర్వహిస్తుండగా టెర్రరిస్టులు ఈ ఉగ్రదాడికి పాల్పడ్డారు.

ఉగ్రదాడి సంఘటనలో రష్యాలో కలకలం రేపింది. ఈ సంఘటన గురించి తెలుసుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌ అధికారులు కూడా అక్కడికి వెళ్లారు. సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మరోవైపు ఈ కాల్పులపై ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాద సంస్థ స్పందించింది. ఈ కాల్పులకు తామే బాధ్యులమంటూ వెల్లడించింది. కాగా.. ఈ కార్యక్రమంలో కాల్పులు జరుపుతున్న సమయంలోనే భవనంపై మంటలు చెలరేగాయి. క్రమంగా ఆ మంటలు భవనం మొత్తం వ్యాపించాయి. దాంతో.. ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. ఒక వైపు తుపాకీ కాల్పుల చప్పుళ్లు.. మరోవైపు భవనం మొత్తం అంటుకున్న మంటలు. కార్యక్రమంలో పాల్గొన్న జనాలంతా ప్రాణభయంతో ఎటుపడితే అటు పరుగు తీశారు. మంటల కారణంగా ఆ ప్రాంతమంతా నల్లటిపొగలు అలుముకున్నాయి. ఇక ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

ముందుగా కన్సర్ట్‌ హాల్‌లోకి టెర్రరిస్టులు ప్రవేశించి అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మ్యూజిక్‌ షో అప్పుడే ముగియడంతో బయటకు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఏం జరుగుతుందో తెలియక అక్కడున్నవారు కొందరు సీట్ల మధ్య దాక్కున్నారు. కాల్పుల గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లారు. దాడికి పాల్పడ్డవారిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇంకా టెర్రరిస్టుల గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story