మాస్కోలో టెర్రర్ అటాక్‌పై ముందే హెచ్చరించిన అమెరికా

రష్యా రాజధాని మాస్కోలో టెర్రరిస్టులు దాడులకు తెగబడ్డారు. మాస్కోలో

By Srikanth Gundamalla  Published on  23 March 2024 4:42 AM GMT
terror attack,  moscow, america warn,  pm modi,

మాస్కోలో టెర్రర్ అటాక్‌పై ముందే హెచ్చరించిన అమెరికా

రష్యా రాజధాని మాస్కోలో టెర్రరిస్టులు దాడులకు తెగబడ్డారు. మాస్కోలో ఓ మ్యూజిక్‌ కన్సర్ట్‌ నిర్వహిస్తున్న నేపథ్యంలో అందులోకి ప్రవేశించి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ సంఘటనలో 60కి పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. మారణహోమం సృష్టించారు. ఇంకా వందల మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో అమెరికా కీలక ప్రకటన చేసింది. రష్యాలో మాస్కో టార్గెట్‌గా ఉగ్రవాదులు దాడికి ప్లాన్ చేస్తున్నట్లు ముందే హెచ్చరించామని అమెరికా తెలిపింది. ఇదే విషయాన్ని వైట్‌హౌస్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి ఆడ్రియెన్ వాట్సన్ తెలిపారు. మార్చి నెల మొదట్లోనే అమెరికా గవర్నమెంట్‌కు ఉగ్రదాడికి సంబంధించిన సమాచారం అందినట్లు తెలిపారు. ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో దాడులు చేయాలని ఐసిస్‌ ప్లాన్ చేసిందని వారు తెలిపారు. ఇక తాము కూడా వెంటనే రష్యాలో ఉన్న అమెరికన్లకు అడ్వైజరీ కూడా జారీ చేసినట్లు చెప్పారు. డ్యూటీ టు వార్న్‌ పాలసీ కింద ఇదే విషయాన్ని రష్యా ప్రభుత్వంతో కూడా పంచుకున్నట్లు వాట్సన్ చెప్పారు.

ఇక ఈ ఉగ్రదాడిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. మ్యూజిక్ కాన్సర్ట్‌పై కాల్పులు జరపడాన్ని ఖండించారు. ఈ దుఃఖ సమయంలో రష్యా ప్రభుత్వానికి, ప్రజలకు భారత్‌ అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌ వేదికగా ఒక పోస్టు పెట్టారు.

కాగా.. క్రాకస్‌ సిటీ కాన్సర్ట్‌ హాల్‌లోకి కొందరు టెర్రరిస్టులు ప్రవేశించారు. తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. కనిపించిన వారిని కనిపించినట్లుగా కాల్చేశారు. ఆ తర్వాత గ్రనేడ్‌లు కూడా విసిరినట్లు తెలుస్తోంది. దాంతో.. బిల్డింగ్‌లో మంటలు అంటుకున్నాయి. జనాలకు ఎటూ వెళ్లే పరిస్థితి లేకుండా చేసి ఐసిస్‌ ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు.

Next Story