ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు ఇప్పుడు వారే పెద్ద ముప్పుగా మారారు. ఉగ్రవాదులు చేసిన దాడిలో 10 మంది పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్సులోని కెచ్ జిల్లాలో భద్రతాదళాల చెక్ పోస్టులపై గురువారం ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారని ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్‌పిఆర్) డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ బాబర్ ఇఫ్తికర్ చెప్పారు. అప్రమత్తమైన సైనికులు కూడా ప్రతిదాడులు చేశారని.. ఈ ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది మరణించగా, పలువురు గాయపడ్డారు. మెరుపుదాడితో అప్రమత్తమైన పాక్ సైనికులు ముగ్గురు ఉగ్రవాదులను పట్టుకున్నారు. కాగా.. ఇంత వరకు ఏ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు.
బలూచిస్తాన్.. ఇరాన్,అఫ్ఘానిస్తాన్ సరిహద్దులో ఉంది. ఇక్కడ చాలా కాలంగా హింసాత్మక తిరుగుబాటుకు నిలయంగా మారింది. గతంలో చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదులు పలుమార్లు సైనికులపై దాడి చేశారు. ఈ నెల (జనవరి)5న ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలో భద్రతా బలగాలు నిర్వహించిన రెండు వేర్వేరు ఇంటెలిజెన్స్ ఆధారిత ఆపరేషన్‌లలో ఇద్దరు సైనికులతో పాటు పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు.