ప్రజలందరికీ క్షమాభిక్ష.. ప్రభుత్వ ఉద్యోగులు విధుల్లో చేరండి
Taliban Declares General Amnesty.అఫ్గనిస్థాన్ నుంచి అమెరికా సైనిక బలాల ఉపసంహరణ నిర్ణయం తరువాత
By తోట వంశీ కుమార్
అఫ్గనిస్థాన్ నుంచి అమెరికా సైనిక బలాల ఉపసంహరణ నిర్ణయం తరువాత నుంచి అఫ్గనిస్థాన్ దేశంలో పరిస్థితులు చాలా వేగంగా మారిపోయాయి. తాలిబన్లు ఒక్కొ ప్రాంతాన్ని ఆక్రమిస్తూ దేశ రాజధాని కాబుల్‌ను హస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే. అఫ్గాన్ తాలిబన్ల వశమవడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గతంలోలాగా మళ్లీ చీకటి రోజులు తప్పవని భీతిల్లుతున్నారు. ప్రజలు దేశం విడిచి పారిపోయేందుకు విమానాశ్రయాలకు పోటెత్తుతున్నారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణం చేస్తూ.. ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో తాలిబన్లు సంచలన ప్రకటన చేశారు. ప్రజలందరికి క్షమాబిక్ష ప్రసాదిస్తున్నామని తెలిపారు. వెంటనే ప్రభుత్వ ఉద్యోగులు తమ విధుల్లో చేరాలని ఆదేశించారు. దేశ ప్రజలందరికీ క్షమాబిక్ష ప్రకటిస్తున్నాం. మీరు పూర్తి విశ్వాసం, భరోసాతో మీ జీవితం సాగించండి. సాధారణ, రోజువారీ కార్యకలాపాలు యధావిధిగా కొనసాగించుకొవచ్చు. ప్రభుత్వ అధికారులంతా విధుల్లో హాజరుకావాలి అని మంగళవారం తాలిబన్లు ఓ ప్రకటన చేశారు.
తమ ఆక్రమణలో ప్రజల్లో నెలకొన్న ఆందోళనను తొలగించేందుకు తాలిబన్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవ్వరికి హాని తలపెట్టబోమని నిన్న భరోసా ఇచ్చారు. తాలిబన్ల అధికార ప్రతినిధి సుహైల్ షహీన్ మాట్లాడుతూ.. అనుమతి లేకుండా ఎవరి ఇళ్లలోకి ప్రవేశించకూడదని పైటర్లకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులు, గౌరవాన్ని పరిరక్షించాల్సిందిగా వారికి సూచనలు జారీ చేశామని ట్వీట్ చేశారు.